
- నాయకత్వం అంటే పదవులు కాదు..
- లీడర్కు ఉండాల్సింది ఉత్తమ వ్యక్తిత్వం
- పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి బుక్ రిలీజ్ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు
హైదరాబాద్, వెలుగు: నాయకత్వం అంటే పదవులు కాదని, లీడర్కు ఉండాల్సింది ఉత్తమ వ్యక్తిత్వం అని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు అన్నారు. గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య ఉద్యమం కోసం తమ మొత్తం ఆస్తిని, జీవితాలను అంకితం చేసిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి జీవిత విశేషాలతో రూపొందించిన ‘నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్ర్యం తప్ప మరో ప్రతిఫలాపేక్ష లేని ఆ దంపతుల పోరాటం అభినందనీయమన్నారు.
మోతుబరి కుటుంబమైనా.. యావదాస్తినీ స్వాతంత్ర్య పోరాటం కోసం ధారపోశారని కొనియాడారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొన్న వారి దాంపత్యం ఆదర్శనీయమైనదని పేర్కొన్నారు. పదవులను త్యజించడం, సిద్ధాంత వైరుధ్యం కలిగిన వారికి కూడా ఆశ్రయమివ్వడం, తప్పును తప్పు అని కరాఖండిగా చెప్పి జైలుకు వెళ్లేందుకూ సిద్ధపడిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రచయితలు గోపాల స్వామి. వెంకటరంగ నాయకులు, ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సీనియర్ ఐఏఎస్ ఏవీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.