
అన్యాక్రాంతమైన రూ.2 కోట్ల ప్రభుత్వ భూమి
నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్
ఇండ్ల స్థలాలకు లావణి పట్టాలిచ్చిన తహసీల్దార్
ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
మహాదేవ్‌పూర్‌లో అధికార పార్టీ లీడర్ల దందా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఇండ్లు లేని పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ స్థలంలో టీఆర్‌ఎస్ లీడర్లు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌ల కోసం మూడంతస్తుల బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు. అధికార పార్టీ లీడర్లు కావడంతో రెవెన్యూ ఆఫీసర్లు సైతం తమకు తోచిన విధంగా సహకరిస్తున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ధారాదత్తం చేసేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిరుపేదల పేరుతో వ్యవసాయ భూములకు ఇచ్చే లావణి పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేశారు. అధికార పార్టీ లీడర్లు ఆ పేదల చేతిలో ఎంతో కొంత పెట్టి భూములు లాక్కొని బిల్డింగ్‌లు కడుతున్న విషయం తెలిసి కూడా ఆఫీసర్లు స్పందించడం లేదు.
రూ.2 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌లోని 588 ప్రభుత్వ సర్వే నెంబర్‌లో 16 గుంటల భూమి ఉంది. 363 నేషనల్ హైవే పక్కన ఉండడంతో విలువ బాగా పెరిగింది. 2004లో అప్పటి ప్రభుత్వం కొందరు పేదలకు ఇండ్ల పట్టాలిచ్చింది. చాలా యేళ్లు ఖాళీగా ఉండడంతో పేద దళితులు కొందరు ఈ స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు గుడిసెలను కూల్చివేయడానికి ప్రయత్నించగా పెద్ద గొడవ జరిగింది. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ స్థలంపై కొందరు కోర్టుకెళ్లారు. జిల్లాల పునర్విభజన జరిగాక, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మహదేవ్‌పూర్‌లో ఇండ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. రోడ్డు పక్కన గుంటకు రూ.20 లక్షలకు పైగా ధరలు పలికాయి. దీంతో ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలంపై కొందరు టీఆర్‌ఎస్ లీడర్లు కన్నేశారు. ఎలాగైనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి భారీ స్కెచ్ వేశారు.
చక్రం తిప్పిన లీడర్లు
భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, అధికార పార్టీకి చెందిన ఓ మాజీ జడ్పీటీసీ, ఓ పీఏసీఎస్ చైర్మన్, కాళేశ్వరం టెంపుల్ డైరెక్టర్ ఒకరు, ఓ గ్రామ సర్పంచ్ కలిసి 588 ప్రభుత్వ సర్వే నెంబర్‌లో గల ఖాళీ జాగాపై కన్నేశారు. అప్పటికే గొడవలు జరిగి కేసుల పాలైన పేదలను కలిసి వారి చేతిలో ఎంతో కొంత ముట్ట చెప్పి కాగితాలు రాయించుకున్నారు. ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్లను కలిసి ఏడుగురు పేదల పేరిట 9 గుంటలకు లావణి పట్టా పాస్‌బుక్కులు తీసుకున్నారు.
ఈ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతోంది.
లావణి పట్టా పాస్‌బుక్కులిచ్చిన తహసీల్దార్
ప్రభుత్వ రూల్స్ ప్రకారం రెవెన్యూ ఆఫీసర్లు సాగు భూములకు మాత్రమే పట్టాదారు పాస్‌బుక్కులివ్వాలి. ఇండ్ల స్థలాలు అయితే కేవలం పహాణీలో మాత్రమే పేరు చేర్చాలి. గవర్నమెంట్ ల్యాండ్‌లో సాగులో ఉన్న రైతులకు మాత్రమే లావణి పట్టా భూములివ్వాలి. అది కూడా అసైన్‌మెంట్ ఆమోదం పొంది లావణి పట్టా పొంది న రైతులకు మాత్రమే ఇవ్వాలి. కొత్తగా పాస్‌బుక్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ ఫైల్ రెడీ చేసి ఆర్డీవో, కలెక్టర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే లావణి పట్టా పాస్‌బుక్కులివ్వాలి. ప్రభుత్వ ఖాళీ జాగలను ఇండ్ల స్థలాలుగా గుంట, రెండు గుంటల చొప్పున విభజించి పంపిణీ చేస్తే నివేశన స్థలాల పేరిట పట్టాలు అందించాలి. దీనికి కూడా ఆర్డీవో, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి.అయితే మహాదేవ్‌పూర్‌లోని 588 ప్రభుత్వ సర్వే నెంబర్‌లో తహసీల్దార్ సొంతంగా నిర్ణయం తీసుకొని ఏడుగురి పేరిట 9 గుంటలకు కొత్తగా లావణి పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేశారు. ఒక్కొక్కరికి గుంటంబావు చొప్పున భూమి రాసిచ్చారు. అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. ఆర్డీవో, కలెక్టర్ పర్మిషన్ లేదు. టీఆర్‌ఎస్ లీడర్లు చక్రం తిప్పి పాస్‌బుక్కులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిల్డింగ్‌లు కడుతున్న లీడర్లు
పేదల పేరిట లావణి పట్టాదారు పాస్‌బుక్కులు జారీ అయిన తర్వాత కొందరు టీఆర్‌ఎస్ లీడర్లు ఈ స్థలాన్ని ఆక్రమించారు. రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల కోసం మూడంతస్తుల బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. సర్కార్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పిల్లర్లు లేచి స్లాబ్‌లు కూడా పడ్డాయి. అయినా ఒక్క రెవెన్యూ ఆఫీసర్ కూడా ఈ స్థలం వైపు కన్నెత్తి చూడడం లేదు. చాలా మంది తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ స్థలంలో భూమిని కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.