నేతలు పట్టించుకోలేదు.. మహిళలంతా చేయి చేయి కలిపారు

నేతలు పట్టించుకోలేదు.. మహిళలంతా చేయి చేయి కలిపారు
  • జట్టు కట్టి... మెట్లు కట్టుకుంటున్నరు

గన్నేరువరం, వెలుగు: చేయి చేయి కలిపి ముందడుగు వేస్తే కానిదంటూ ఏం లేదని ఈ మహిళలు నిరూపించారు. కొండరాళ్లు, ఎండను లెక్క చేయకుండా గుట్ట కింద నుంచి పైకి సిమెంట్, కంకర, ఇసుక బస్తాలను మోశారు. ఊళ్లోని గుడికి వెళ్లే దారిని ఏండ్లుగా నాయకులు పట్టించుకోకపోవడంతో వారే నడుం బిగించారు. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలోని గుట్టపై శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. పైకి వెళ్లాలంటే ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి చందాలు వేసుకుని 3 రోజులుగా మెట్లు కట్టడం స్టార్ట్​ చేశారు. 300 మందికి పైగా గ్రామంలోని మహిళలు స్వచ్ఛందంగా పనుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం నాటికి 212 మెట్లు పూర్తి చేశారు. ఇంకో 150 మెట్లు కట్టాల్సి ఉంది. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సుందరగిరి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గందే రమేశ్ కోరుతున్నారు.