వర్ని, వెలుగు: దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ నెల 18న ఓ రైతు నిజామాబాద్ జిల్లా వర్ని కెనరా బ్యాంక్‌లో క్రాప్ లోన్ చెల్లించేందుకు వెళ్లగా దొంగనోట్ల వ్యవహారం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఈ వ్యవహారంలో 8 మంది ఉన్నారని, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రవికుమార్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు.
ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలిని ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు ఈ నెల 18న కెనరా బ్యాంక్‌లో క్రాప్ లోన్ చెల్లించేందుకు రూ.2,08,500 తీసుకొని బ్యాంకుకు వచ్చాడు. ఆ నోట్లను పరిశీలించిన బ్యాంక్ అధికారులు దొంగనోట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకొని విచారించారు.
జలాల్పూర్ సర్పంచ్ భర్త నరెడ్ల బాలు, అతని తమ్ముడు బీజేపీ నేత నరెడ్ల శంకర్, చందూరు మండలానికి చెందిన సటోజి గోపాల్, వర్ని మండలం అఫంది ఫారమ్‌కు చెందిన పాల్య కల్యాణ్, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఆకాశ్, రమేశ్, మహదేవ్‌ను నిందితులుగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి ఆకాశ్, రమేశ్‌తో కలిసి కొద్ది రోజుల కింద రూ.4 లక్షల దొంగ నోట్లు ముద్రించి వికారాబాద్ లో వాటిని చలామణి చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద రూ.9.86 లక్షల దొంగ నోట్లు, ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లు, కారు, మూడు సెల్ఫోన్లు, ముద్రణ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
