ఆదిలాబాద్, వెలుగు: వృద్ధురాలి మృతికి కారణమైన ఆర్ఎంపీని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపారు. బేల మండలం ఇందిరానగర్‌కు చెందిన ఉర్వెత శాంతాబాయి(65) మంగళవారం ఛాతీలో నొప్పి, తల తిరుగుతోందని ఆర్ఎంపీ లక్ష్మణ్ వద్దకు వెళ్లగా, ఆమెకు ఇంజక్షన్లు, గోలీలు ఇచ్చాడు.
అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోగా 108లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. అప్పటికే ఆమె చనిపోవడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అర్హత లేకున్నా 15 ఏండ్లుగా ఆర్ఎంపీగా వైద్యం చేస్తూ, రోగులకు హై డోస్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి సిరంజీలు, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
