వర్షాలకు కోతకు గురవుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ​కట్ట

వర్షాలకు కోతకు గురవుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ​కట్ట

మహబూబ్​నగర్, వెలుగు : ఉదండాపూర్ ​రిజర్వాయర్​ కట్ట పనులు పూర్తి కాకముందే లీకవుతోంది. వర్షాలకు కోతకు గురై కట్ట కింద ఉన్న పొలాల్లోకి మట్టి చేరడంతో రైతులు పంటలేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పాలమూరు జిల్లా జడ్చర్ల మండలంలో పీఆర్ఎల్ఐ స్కీం కింద నిర్మిస్తున్న ఉదండాపూర్​రిజర్వాయర్ పనులు 20 శాతం పూర్తయ్యాయి. కట్ట నిర్మాణానికి సంబంధించి కొంత పనులు మిగిలి ఉండగా, రివిట్​మెంట్​వర్క్స్​జరగలేదు. అయితే, వర్షాలకు కట్ట కోతకు గురవుతోంది. నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నాసిరకం మట్టిని వాడడం, అందులో ఉన్న రాళ్లను కూడా తీయకుండా రోలింగ్​ చేయడంతో వానలకు కట్ట దెబ్బతింటోంది. దీంతో కట్ట మీద పోసిన మట్టి..దిగువన ఉన్న రైతుల పొలాల్లోకి చేరుతోంది. నీళ్లు కూడా కట్ట కిందనే ఆగుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్ ​కట్ట చుట్టూ నీళ్లు నిల్వకుండా రైతుల పొలాల పొంటి పది రోజుల కింద జేసీబీలతో ఐదు ఫీట్లు వెడల్పు, మూడు ఫీట్ల లోతుతో కందకాలు తవ్వించాడు. వర్షాలకు కట్ట కింద స్టోరేజ్​అవుతున్న నీటిని, ఆ కందకాల ద్వారా బయటకు డైవర్ట్​ చేస్తున్నాడు. రైతుల పొలాల్లో కందకాలు తీయడంతో రైతులు వాటిని దాటలేక వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు.

దెబ్బతిన్న పంటలు..రాని కాంట్రాక్టర్​
ప్రస్తుతం కట్ట బయట ఉన్న రైతులు దాదాపు 250 ఎకరాల్లో మక్కలు, పత్తి, వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. వర్షాలకు కట్ట కోతకు గురై మట్టి మొత్తం పొలాల్లోకి చేరడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నెల కింద పత్తి వేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.  ప్రస్తుతం పత్తి మొక్క దశలో ఉండగా, నీళ్లు, మట్టి చేరడంతో దెబ్బతిన్నాయి. మళ్లీ గుంటకలు, మందులు కొట్టాల్సి రావడం, ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రైతులు నష్ట పరిహారం చెల్లించాలని కాంట్రాక్ట్​ కంపెనీని డిమాండ్​ చేస్తున్నారు.  

కోర్టుకు వెళ్లిన రైతులే టార్గెట్​
రిజర్వాయర్​ బయటి భాగంలో 36 మంది రైతు లకు చెందిన 350 ఎకరాలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది. 2013 చట్ట ప్రకా రం పరిహారం ఇవ్వాలని వీరు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు వీరి నుంచి భూములు బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 3న ఉదయం ఆరు గంటల నుంచి రెవెన్యూ ఆఫీసర్లు కోర్టుకు వెళ్లిన రైతుల పొలాల్లో జేసీబీలతో తవ్వి పంటలు, తోటలను నాశనం చేశారు. ఇప్పుడు కాంట్రాక్టర్​ కట్ట కింద నీళ్లు నిలుస్తున్నాయని కారణం చెబుతూ, సదరు రైతుల పొలాల పొంటి కాల్వలు తవ్వడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంతేగాకుండా రిజర్వాయర్​ వద్ద  ఏ చిన్న ఆందోళన చేసినా ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు పోలీసులను తోలుకొని వచ్చి బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.