ఇదే మాట ప్రతి సినిమాకి వినాలని కోరిక : నాని

ఇదే మాట ప్రతి సినిమాకి వినాలని కోరిక : నాని

‘సక్సెస్ వచ్చింది  కదా అని, అదే జానర్‌‌ను  రిపీట్ చేయకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే సినిమాలు చేయలనేది నా లక్ష్యం’ అంటున్నాడు నాని. ఆయన హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్‌‌ గురించి నాని ఇలా ముచ్చటించాడు.

‘దసరా’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే.. దీని కోసమే కదా మేము సినిమా తీసింది అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది.  నటుడిగా నేను సంతోష పడతాను తప్ప తృప్తి పడను. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఎందుకంటే తృప్తి పొందితే.. ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ‘దసరా’తో టీమ్ అందరికీ మంచి పేరు రావడం గ్రేట్ ఫీలింగ్. 

కథ వినగానే ఎక్సైట్ అయ్యా.. శ్రీకాంత్ కొత్త దర్శకుడు కనుక ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్‌‌ని అతనికి ఇవ్వాలని డిసైడ్ అయ్యా. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పా. తన వర్క్‌‌పై నాకు అంత కాన్ఫిడెన్స్‌‌ ఏర్పడింది.  ప్రేమ, స్నేహం, పగ అనేవి యూనివర్సల్ ఎమోషన్స్. మన కల్చర్‌‌‌‌ను చూపిస్తూ ఇలాంటి కథ చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్లడం మన బాధ్యత. అందుకే పాన్ ఇండియా రిలీజ్‌‌ ప్లాన్ చేశాం. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మతో పాటు తెలంగాణ కల్చర్‌‌‌‌లోని చాలా విషయాలు నేర్చుకున్నాను. 

ఇందులో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు.. ఎందుకంటే ప్రతి సీన్ కష్టపడి చేసిందే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పనిచేశాం. క్లైమాక్స్ సీన్ విషయంలో మాత్రం.. థియేటర్‌‌‌‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఎక్సయిటెడ్‌‌గా ఎదురుచూశాం. ఆ సీన్‌‌ను ఆన్‌‌ లైన్‌‌ ఎడిటింగ్‌‌లో చూసే షాక్ అయ్యాం. ప్రేక్షకులు రీరికార్డింగ్‌‌తో చూశారు కనుక ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది.ఇలాంటి మాస్‌‌ రస్టిక్ సినిమా చేయాలని నేనెప్పుడూ ఎదురుచూడలేదు. ఆమాటకొస్తే నేను దేని కోసం ఎదురుచూడను. ‘దసరా’ లాంటి మాస్ సినిమా తర్వాత ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్నా . ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే సినిమాలు చేయలనేది నా లక్ష్యం. 
    
నాకు లవర్‌‌‌‌ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, నా కెరీర్‌‌‌‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌‌ అయిన దసరా, ఎంసిఏ, నేను లోకల్ చిత్రాలు మాత్రం మాస్‌‌ సినిమాలు. నేను ఏ జానర్ అని  చూడను. నచ్చితే చేసేస్తాను. ఏ  జానర్ కూడా రిపీట్ చేయకపోవడమే నాకు కంఫర్ట్. ఒక సినిమా వర్కవుట్ అయిందని అవే చేస్తూ పోతే బిజినెస్‌‌మ్యాన్ అవుతాను కానీ యాక్టర్‌‌‌‌ని కాదు కదా. 

నా కెరీర్‌‌‌‌ని ‘దసరా’కి ముందు, ఆ తర్వాత అంటున్నారు. కానీ ఇప్పటికే ఇది చాలాసార్లు విన్నాను. భలే భలే మగాడివోయ్, జెర్సీ, నిన్ను కోరి సినిమాల సమయంలోనూ ఇదే అన్నారు... ఇప్పుడు ‘దసరా’కి అంటున్నారు. ఇదే మాట నా ప్రతి సినిమాకి వినాలని నా కోరిక.  ‘దసరా’కి ఇతర భాషల్లో రెండు కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. హిందీలో వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. పాజిటివ్‌‌ టాక్‌‌తో ముందుకెళుతోంది. నేనేమీ అమితాబ్‌‌ బచ్చన్‌‌ను కాదు కదా.. ఫస్ట్ డేనే ఎగబడి చూడటానికి. అక్కడ రోజురోజుకి కలెక్షన్స్  పెరుగుతున్నాయి.