
ఉన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్
వారంకిందట పెట్రోల్ పోసి నిప్పంటించిన వికేశ్
ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత సోమవారం చనిపోయింది. కాలిన గాయాలతో ఓ ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. 40శాతం గాయాలయ్యాయని, ఆమె బాడీ మొత్తం సెప్టిక్కు గురయిందని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. వార్ధాలోని హింగాన్ఘాట్లో నివాసం ఉండే అంకితా పిసుండే(25) స్థానికంగా లెక్చరర్ గా పనిచేస్తోంది. తనని ప్రేమించాలంటూ కొద్దిరోజులుగా వెంటపడుతున్న దుండగుడు వికేశ్ నాగ్రేల్(27).. ఈ నెల 3 న అంకిత కాలేజీకి వెళ్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో వారం పాటు ప్రాణాల కోసం పోరాడిన అంకిత.. కండిషన్ సీరియస్ కావడంతో ప్రాణాలు విడిచింది. దీంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలకు దిగారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం, ఇతర లాంఛనాల కోసం అంకిత డెడ్‌బాడీని ఆస్పత్రి వర్గాలు పోలీసులకు అప్పగించాయి. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా హింగాన్ ఘాట్‌లో పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంకిత మృతి పట్ల సీఏం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ నేత సుప్రియా సులే ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తామని, బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.