సాగర్ ఎడమకాల్వకు గండి..వేల ఎకరాల్లో పంట నష్టం

సాగర్ ఎడమకాల్వకు గండి..వేల ఎకరాల్లో పంట నష్టం

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది.  నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో సాగర్‌ ఎడమ కాలువకు గండి పడటంతో లక్ష్మిదేవి గూడెం, నిడమనూరు, నర్సింహులు గూడెం గ్రామాలు నీట మునిగాయి. మరిన్ని గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో.. పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  అటు  లెఫ్ట్ కెనాల్ వాటర్ను  అధికారులు నిలిపివేశారు.   నీటి ప్రవాహం కారణంగా మిర్యాలగూడ నుంచి దేవరకొండకు రాకపోకలు బంద్ అయ్యాయి.  నేషనల్ హైవే 167 పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.  అటు నిడమనూరు మండల కేంద్రంలోని  పెట్రోల్ బంక్లోకి నీళ్లు ప్రవేశించాయి. 

నీటమునిగిన వరిపంట..

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో సుమారు వెయ్యి ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. గండిపడిన ప్రాంతంలోని పొలాలన్నీ మునిగిపోయాయి. వరి నాట్లు పూర్తిగా మునిగిపోవడంతో నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో పొలాలు నీట మునుగుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.   

ప్రమాదానికి కారణమేంటంటే..?

కాల్వకు గండిపడటానికి కారణం మట్టికట్ట బలహీన పడటమే అని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో కాల్వలోకి సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అధికారులు..నీటి విడుదల ఆపేశారు. సాగర్ కాల్వకు గత 28 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. శివారులోని  పొలాల కోసం నీటిని విడుదల చేశారు.