- బీజేపీ, ఎల్డీఎఫ్ కుమ్మక్కయ్యాయని ఆరోపించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత
అలప్పుజ, న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం పినరయి విజయన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం అలప్పుజలో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేరళలోని వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్) తన సిద్ధాంతాలను కోల్పోయిందని, ప్రజలకు పూర్తిగా దూరమైందని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ కేవలం పేరుకే వామపక్షమని, అందులో సిద్ధాంతాలు ఏవీ మిగలలేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా మాజీ సీపీఎం నేత జీ సుధాకరన్ కాంగ్రెస్ వేదికపైకి రావడం లెఫ్ట్ పార్టీల్లో వస్తున్న పెనుమార్పుకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. కేరళలోని వామపక్ష నాయకత్వం తమ రాజకీయ మనుగడ కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులతో చేతులు కలిపిందని రాహుల్ ఆరోపించారు. ఒక ‘అదృశ్య మతతత్వ హస్తం’ వామపక్షాలను నడిపిస్తోందని, దీనివల్ల కమ్యూనిస్ట్ కార్యకర్తలు మోసపోయినట్లు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, సీఎం విజయన్ ఇద్దరూ ప్రజలకు దూరమయ్యారని రాహుల్ విమర్శించారు.
సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల నాయకుల్లో అహంకారం పెరిగిందని, అధికారం తమ సొంతమని వారు భావిస్తున్నారని మండిపడ్డారు. కేరళలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలను లెఫ్ట్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ధ్వజమెత్తారు. సీఎం విజయన్ కూతురు వీణా విజయన్‌కు చెందిన ‘ఎక్సాలాజిక్’ సంస్థపై వస్తున్న అవినీతి ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తన పిల్లలను కాపాడుకోవడానికే సీఎం విజయన్ మోదీకి తలొగ్గుతున్నారని రాహుల్ ఆరోపించారు. కేరళ సీఎం దేశంలోని అత్యంత మితవాద శక్తుల (బీజేపీ/ఆర్ఎస్ఎస్) రక్షణ కోరుతున్నారని, తద్వారా ఆయన పాలనను గాలికొదిలేశారని విమర్శించారు.
యూడీఎఫ్ ఎన్నికల హామీలు
ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాలకు వెళ్లే విద్యార్థినులకు నెలకు రూ. వెయ్యి ఆర్థిక సాయం, రూ.3 వేల సామాజిక పెన్షన్, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ అందించనున్నట్టు చెప్పారు. ఈ నెల 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడతాయి.
