అంతర్జాతీయంగా.. పాక్ ఏకాకి: అండగా ఉండేందుకు ముందుకు రాని మిత్రదేశాలు

అంతర్జాతీయంగా..  పాక్ ఏకాకి: అండగా ఉండేందుకు ముందుకు రాని మిత్రదేశాలు
  • ఛీకొడుతున్న ప్రపంచ దేశాలు 
  • ఐక్యరాజ్యసమితిలోనూ మొట్టికాయలు 
  • కోరి తెచ్చుకున్న కయ్యంతో.. ఆర్థికంగా మరింత దివాళా ఖాయం

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ తీరును ఖండించినా, ఆ దేశం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ తప్పుల మీద తప్పు చేస్తోంది. దీంతో ఒకటి రెండు మిత్ర దేశాలు మినహా పాక్ కు అండగా ఉంటామంటున్న దేశాలే కరువయ్యాయి. ఫలితంగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పాక్ దాదాపుగా ఏకాకిగా మిగిలిపోయింది. ఇస్లామిక్ దేశాల కూటమిలో పట్టు నిలబెట్టుకోవాలన్న తపనతో ఉన్న టర్కీ, ఇరాన్, ఇతర కొన్ని దేశాలు మాత్రమే పాక్ కు అది కూడా నామమాత్రంగా సాయం చేస్తున్నాయి. 

చైనాపై భారీగా ఆశలు పెట్టుకుని బార్డర్ లో కాల్పులకు తెగబడిన పాక్ కు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కూడా మొహం చాటేస్తోంది. టెర్రరిజాన్ని ఖండిస్తున్నామని అంటూనే రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చెప్తోంది. ఇక సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు పాక్ కు ఎలాంటి మద్దతు ప్రకటించకపోగా టెర్రరిజంపై భారత్ పోరాటాన్ని సమర్థించాయి. ఇప్పటిదాకా పాకిస్తాన్‌కు అండగా ఉంటూ వచ్చిన ఖతార్ ఇప్పుడు తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. 

మరోవైపు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ సహా ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజంపై భారత్ కు పోరాడే హక్కు ఉందని ఇప్పటికే  స్పష్టం చేశాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ సభ్య దేశాలు పాక్ కు మొట్టికాయలు వేశాయి. దీంతో భారత్ తో కయ్యం పెట్టుకున్న తర్వాత  అంతర్జాతీయ సమాజంలో పాక్ దాదాపుగా ఏకాకి అయిపోయింది.  

మరింత దివాళా ఖాయం.. 

పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే తప్ప పూట గడిచే పరిస్థితి లేదు. దీనికితోడు ఇప్పుడు యుద్ధానికి కాలు దువ్వడంతో ఆ దేశానికి కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలూ అడుగంటిపోనున్నాయి. పాక్​కు సాయం చేస్తే.. ఆ నిధులను టెర్రరిజానికి వాడుతోందంటూ ఇప్పటికే ఐఎంఎఫ్, ఇతర సంస్థలకు భారత్ వివరించింది. అంతర్జాతీయ సమాజంలో కీలకమైన అన్ని దేశాలతోనూ చర్చలు జరిపి దౌత్యపరంగానూ పాక్​ను ఒంటరి చేసింది. 

అందుకే ఇప్పుడు పాక్ కు ఇటు రుణాలు ఇచ్చి ఆదుకునే దేశాలు.. అటు యుద్ధంలో అండగా నిలిచే దేశాలూ కరువయ్యాయి. పాకిస్తాన్ కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్​ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు మొదటి దశలో 1 బిలియన్ డాలర్ల రుణం విడుదల చేసింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగా 6 బిలియన్ డాలర్ల రుణం విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు యుద్ధం వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుంది. 

ఫలితంగా దా యాది దేశం మరింత దివాళా దిశగా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇండియా పాక్ కు ఆ జలాల సరఫరాను అడ్డుకుంటే వ్యవసాయ సంక్షోభం కూడా తలెత్తి మరింతగా కుదేలవనుంది. వీటితోపాటు పాక్ ను అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనకుండా భారత్ అనుకూల, మిత్ర దేశాలు నిషేధించడం ద్వారా కూడా ఆ దేశాన్ని మరింత ఒంటరి చేసే అవకాశాలు ఉన్నాయి.