
బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) కు వ్యతిరేకంగా.. విపక్షాలు చేపట్టిన నిరసనల మధ్య ఆన్ లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. బుధవారం లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ ( ఆగస్టు 21 ) రాజ్యసభ ముందుకొచ్చింది. రాజ్యసభలో వాయిస్ ఓట్ ద్వారా ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందటం ద్వారా ఆన్ లైన్ మనీ గేమింగ్ కు మూడేళ్లు జైలు శిక్ష లేదా రూ. కోటి జరిమానా విధించేలా చట్టం అమల్లోకి వచ్చింది.
గురువారం ( ఆగస్టు 21 ) ఆన్ లైన్ గేమింగ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఆన్ లైన్ మనీ గేమింగ్ డ్రగ్ అడిక్షన్ లాంటిదని.. ఆన్ లైన్ గేమింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు కోర్టులో ఈ బిల్లును సవాల్ చేస్తారని అన్నారు. ఆన్ లైన్ గేమింగ్ నిషేదానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారం కూడా మొదలు పెడతారని అన్నారు. ఆన్ లైన్ గేమింగ్ ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదానికి మద్దతివ్వడం కూడా చూశామని అన్నారు.
రియల్ మనీ గేమింగ్ (పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్) నిషేధించడం, ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించడం ఈ బిల్లు లక్ష్యం. అలాగే భారత్‌ను గ్లోబల్ గేమింగ్ హబ్‌గా మార్చాలని కూడా టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. ఈ బిల్లు ప్రకారం సెంట్రల్ ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఇది గేమ్స్‌ను ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, సోషల్, రియల్ మనీ గేమ్స్ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది.
రియల్ మనీ గేమ్స్ ను ఆఫర్ చేయోద్దు, వాటికి సహకారం అందివొద్దు.. అడ్వర్టైజ్మెంట్నూ నిషేధించారు. బ్యాంకులు కూడా వీటి లావాదేవీలు చేయకూడదు. రియల్ మనీ గేమ్స్ నిర్వహిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.1 కోటి జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించవచ్చు. వీటిని అడ్వర్టైజ్ చేస్తే రెండేండ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్. మళ్లీమళ్లీ చేస్తే ఐదేండ్ల జైలు, రూ.2 కోట్ల ఫైన్ విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలు. వీటిని ఆడేవారిని బాధితులుగా పరిగణిస్తారు.