
దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన యానిమేటెడ్ చిత్రం 'మహాఅవతార్ నరసింహ' . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి పెద్ద స్టార్‌కాస్ట్ లేకుండానే అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. విడుదలైన 27 రోజులు గడిచినా, బాక్సాఫీస్ వద్ద సినిమా స్థిరంగా రాణిస్తోంది. సినిమా కథ, ఆకట్టుకునే వీఎఫ్‌ఎక్స్ , ఆధ్యాత్మిక థీమ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
పెద్ద సినిమాల పోటీలోనూ..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' , సూపర్ స్టార్ రజనీ కాంత్ 'కూలీ' వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పటికీ, 'మహాఅవతార్ నరసింహ' అద్భుతమైన వసూళ్లను సాధించింది. మూడో వారంలో ఏకంగా రూ70 కోట్లు రాబట్టిన ఈ సినిమా, 22వ రోజున, అంటే నాలుగో శుక్రవారం కూడా రూ7.25 కోట్లు కలెక్ట్ చేసింది. దీనిని బట్టి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి భిన్నంగా, 'వార్ 2' కేవలం 7 రోజుల్లోనే రూ.5 కోట్లకు పడిపోయింది. 'కూలీ' రూ. 7.50 కోట్లకు దిగివచ్చింది.
సూళ్ల పరంగా రికార్డుల హోరు..
'మహాఅవతార్ నరసింహ' 27వ రోజున రూ . 1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు దేశీయంగా అన్ని భాషల్లో కలిపి రూ.217.10 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం రూ.2 కోట్ల లోపు ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, మౌత్ టాక్ కారణంగా అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా రూ.300 కోట్లను సునాయాసంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ అద్భుతమైన విజయం, 'మహాఅవతార్ సినిమాటిక్ యూనివర్స్'కు బలమైన పునాది వేసింది. ఆధ్యాత్మిక నేపథ్యం కారణంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారతదేశంలోనే కాకుండా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లోనూ సినిమా మంచి వసూళ్లను సాధించింది. భారతదేశ యానిమేషన్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా సాధించిన ఘన విజయం, భవిష్యత్తులో భారతీయ యానిమేషన్ చిత్రాలకు కొత్త మార్గాలను చూపిస్తుందని సినీ వర్గాలు తమ అభిప్రాయన్ని పంచుకుంటున్నారు.