లీగల్​ నోటీసులు వెనక్కు తీస్కోండి..లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు: రేవంత్​

లీగల్​ నోటీసులు వెనక్కు తీస్కోండి..లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు: రేవంత్​
  • అరవింద్​ కుమార్​కు నోటీసులు పంపిన పీసీసీ చీఫ్​
  • రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కామెంట్​
  • బేస్​ ప్రైస్​ను ఇప్పటికీ ఎందుకు బయటకు పెట్టట్లేదని ఫైర్​ 

హైదరాబాద్, వెలుగు: ఓఆర్​ఆర్ లీజు విషయంలో ఐఏఎస్​ ఆఫీసర్​ అరవింద్ కుమార్​ తనకిచ్చిన లీగల్​ నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. వాపస్​ తీసుకోకుంటే తాను సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం అరవింద్ కుమార్​కు నోటీసులు పంపించారు. ‘మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో అరవింద్​ కుమార్​కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక ఐఏఎస్ చేసే పనికి సంబంధించి ఎన్నో సర్వీస్​ రూల్స్ ఉంటాయి. కానీ, అరవింద్​ కుమార్​వాటిని పాటించడం లేదు. అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా ఎదురుదాడికి దిగుతున్నారు. 

ఆలిండియా సర్వీసెస్​ రూల్స్ (కండక్ట్​) 1968 ప్రకారం.. ఓ ఐఏఎస్​ అధికారి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తటస్థంగా పనిచేయాలి. అరవింద్​కుమార్​అధికార పార్టీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు’అని రేవంత్​ ఫైరయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం సెక్రటేరియెట్​కు వెళ్తే ఎంపీనని కూడా చూడకుండా అడ్డగించి తనను అరెస్టు చేయించారని మండిపడ్డారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే నోటీసులిచ్చారని ఆరోపించారు. 

నివేదికలు పబ్లిక్​ డొమైన్​లో ఎందుకు పెట్టట్లే?

ఓఆర్​ఆర్ సగభాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకే వస్తుందని రేవంత్​అన్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. దానికి గండికొట్టేలా ఐఆర్బీ ఇన్​ఫ్రా అనే సంస్థకు కేవలం రూ.7,380 కోట్లకే 30 ఏండ్లపాటు ఎలా లీజుకిస్తారని ప్రశ్నించారు. టెండర్​ను కట్టబెట్టే క్రమంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారని ఆరోపించారు. ‘హెచ్​ఎండీఏ మాస్టర్​ ప్లాన్​2031తో ముగుస్తుంది. ఆ తర్వాత అది మారిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో 30 ఏండ్లపాటు లీజుకిస్తే సమస్యలు వస్తాయి. దేశంలో ఏ రోడ్​ టెండర్​నూ 20 ఏండ్లకు మించి ఇవ్వలేదు. టోల్​వసూలు చేసే టెండర్​కాలపరిమితి 15 నుంచి 20 ఏండ్ల వరకే ఉండాలని నేషనల్​హైవేస్ అథారిటీ ఆఫ్​ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) రూల్స్​ పెట్టింది. ఎన్​హెచ్​ఏఐ అభ్యంతరాలనూ పక్కనపెట్టి 30 ఏండ్ల కాలానికి సంస్థకు టెండర్​ ఇచ్చారు. రూల్స్​కు విరుద్ధంగా ఐఏఎస్​ అధికారి స్థానంలో ఓ రిటైర్డ్​ ఆఫీసర్​ను నియమించారు. టెండర్​ ప్రక్రియ జరుగుతున్నప్పుడే.. హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​ను కాదని హెచ్​ఎండీఏని ముందు పెట్టారు. ఓఆర్​ఆర్​ బేస్​ ప్రైస్​ ఎంతో చెప్పాలని ఎన్ని సార్లు అడిగినా బయటపెట్టడం లేదు. ఓఆర్​ఆర్​పై ట్రాఫిక్​, టెండర్​ విలువపై మజర్స్​ చేసిన నివేదికనూ పబ్లిక్​ డొమైన్​లో పెట్టడం లేదు. ఇవన్నీ కూడా టెండర్ల ప్రక్రియలో ఏదో గోల్​మాల్​ జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నది’అని రేవంత్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

వాపస్​ తీస్కునే ప్రసక్తే లేదు రేవంత్​ నోటీసులకు హెచ్​ఎండీఏ రిప్లై

ఏపీ రేవంత్​ రెడ్డికి ఇచ్చిన లీగల్​ నోటీసులను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హె చ్​ఎండీఏ) తేల్చి చెప్పింది. ఓ బాధ్యతగల ఎంపీగా ఉండి కొందరు సీనియర్​ అధికారులకు రాజకీ య ఉద్దేశాలను ఆపాదించి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. లీగల్​ నోటీసులను వెనక్కు తీసుకోవాలన్న పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నోటీసులపై హెచ్​ఎండీఏ ప్రకటనను రిలీజ్​ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారమే హెచ్​ఎండీఏ అధికారులు పనిచేస్తారని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి పర్యవేక్షణలో నిబంధనల ప్రకారం పనిచేస్తారని,  ఓఆర్​ఆర్​ టెండర్లలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తటస్థంగా పనిచేశారని తెలిపింది. కానీ, ఆ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎంపీ రేవంత్​ రెడ్డి మాట్లాడారని పేర్కొంది. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలనే లీగల్​ నోటీసులు ఇచ్చామని తేల్చి చెప్పింది. 

పారదర్శకంగా టెండర్​ ప్రక్రియ

ఓఆర్​ఆర్ టోల్ ఆపరేట్ అండ్​ ట్రాన్స్​ఫర్ (ఓఆర్​ఆర్ టీవోటీ) టెండర్​ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్టు హెచ్​ఎండీఏ స్పష్టం చేసింది. ఎన్​హెచ్​ఏఐ నిర్దేశించిన టీవోటీ నిబంధనలను విధిగా పాటించే టెండర్​ను ఖరారు చేశామని తెలిపింది. రాష్ట్ర కేబినెట్​ ఆమో దం మేరకే సంస్థకు 30 ఏండ్ల పాటు టీవోటీ బిడ్​ను ఇచ్చామంది. ఎంపీ రేవంత్​ రెడ్డి ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టుకున్న సమాచారమంతా ఇచ్చామని,తాము  ఏ సమాచారాన్ని దాచలేదని స్పష్టం చేసింది.