‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

ప్రముఖ నటుడు, రామాయణ్ సీరియల్ ఫేం అరవింద్ త్రివేది (82) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి త్రివేదికి గుండెపోటు వచ్చిందని ఆయన మేనల్లుడు కౌస్తుబ్ త్రివేది తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుది శ్వాస విడిచారని కౌస్తుబ్ వెల్లడించారు. అరవింద్ త్రివేది అంత్యక్రియలు బుధవారం ముంబైలోని కాండివాలిలోని శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన తెలిపారు. 

అరవింద్ త్రివేది మృతికి బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1980లో దూరదర్శన్‎లో వచ్చిన రామాయణ్ సీరియల్ ప్రేక్షకులను బాగా అలరించింది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ సీరియల్‎లో అరవింద్ త్రివేది రావణుడి పాత్ర పోషించారు. అరవింద్ త్రివేది తన నటనతో మూడు దశాబ్దాలపాటు గుజరాతీ ప్రేక్షకులను మెప్పించారు. దేశ్ రే జోయా దాదా పరదేష్ జోయా అత్యంత ప్రజాదరణ పొందిన గుజరాతీ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో అరవింద్ నటించి ఆకట్టుకున్నారు. త్రివేది గుజరాత్ రాజకీయాల్లో కూడా రాణించారు. 1991లో బీజేపీ తరఫున అరవింద్ గుజరాత్‌లోని సబర్కథ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా.. సీబీఎఫ్‎సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

ఈ సీరియల్‌‎కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఫస్ట్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రేక్షకుల కోసం దూరదర్శన్‌ మరోసారి ‘రామాయణ్‌’ను పున:ప్రసారం చేసింది.  ఏప్రిల్‌ 16, 2020న తిరిగి ప్రసారమైన ఈ సీరియల్ ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించడంతో రికార్డు సృష్టించింది.

For More News..

కారును ఢీకొట్టి లోయలో పడిన ఆర్టీసీ బస్సు

దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు

టిప్పర్‎ను ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి