దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు

దళితులకు మూడెకరాలు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం మాట మారుతోంది. కచ్చితంగా ఇస్తామని చెప్పిన హామీలపై వెనక్కి తగ్గుతున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలపైనే.. అడ్డంగా మాట మార్చుతున్నారు. దళితులకు మూడెకరాలపై కూడా ఇదే మాట మాట్లాడారు. అసలు దళితులకు మూడెకరాలు ఇస్తామని తామెక్కడా చెప్పలేదన్నారు. దీంతో సీఎం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

‘దళితులకు మూడెకరాలు ఆన్ గోయింగ్ ప్రాసెస్.. విడతల వారీగా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తా.. సాగుభూమి దొరకటం కష్టంగా ఉంది’ ఇదీ ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చిన మాటలు. భూమిలేని పేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అప్లికేషన్లు తీసుకుంటున్నామని, ఇందుకోసం ల్యాండ్ అక్విడేషన్ చేస్తున్నామని.. సీఎం చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. నిన్నటి అసెంబ్లీ సాక్షిగా.. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని తామెక్కడా చెప్పలేదన్నారు. అలాంటి హామీ కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వాలు అశాస్త్రీయంగా భూపంపిణీ చేశాయని ఆరోపించారు. కొందరికి ఎకరం, మరికొందరికి రెండెకరాలు ఇలా ఇచ్చారని చెప్పారు. ఎవరికైనా ఇచ్చే భూమి కనీసం రెండున్నర నుంచి 3 ఎకరాలు ఉండాలనేది శాస్త్రీయమని సీఎం కేసీఆర్ ఆనాడు చెప్పామన్నారు. అందుకే దళితులకు ఇకపై భూమి ఇస్తే అది 3 ఎకరాలను ఫుల్ ఫిల్ చేసేలా ఉండాలని మాత్రమే చెప్పామన్నారు. అదే హామీని మేనిఫెస్టోలోనూ పెట్టామని చెప్పుకొచ్చారు. మేం భూపంపిణీ చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

మార్చి 17, 2015న ఇచ్చిన మాట ప్రకారం.. దళితులకు 3 ఎకరాల భూపంపిణీకి కట్టుబడి ఉన్నామన్నారు. మొత్తమే లేనోళ్లకు 3 ఎకరాలు కొంటామని.. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు.. రెండెకరాలు ఉన్నోళ్లకు ఎకరా.. మొత్తంగా 3 ఎకరాలు ఫుల్ ఫిల్ చేస్తామన్నారు. వీలైనంత ఎక్కువ కుటుంబాలు 3 ఎకరాల భూమి కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ సదాశయమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్‎లో మస్త్ డబ్బులున్నాయన్న సీఎం.. భూముల వివరాలు ఇస్తే కొని పంపిణీ చేసేందుకు సిద్ధమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో దళితులకు మూడెకరాల భూపంపిణీ ఒకటి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు ఈ పథకం తెచ్చామని అప్పట్లో సీఎం చెప్పుకొచ్చారు. 2014 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ పథకం పేరును భూ కొనుగోలు, పంపిణీ పథకంగా మార్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పథకం ప్రారంభమైన మొదటి ఏడాదిలో 959 మంది లబ్ధిదారులకు 2వేల 534 ఎకరాల భూమి అందింది. 2018 ఏప్రిల్ నాటికి మొత్తం 5,607 మంది లబ్దిదారులకు భూములు పంపిణీ చేసింది. ఆ తర్వాత చేతులెత్తేసింది.

దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని తామెక్కడా చెప్పలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దళితబంధు ప్రకటించిన తర్వాత.. మూడెకరాలకు బధులుగా ప్రభుత్వం రూ. 30 లక్షలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారనే విమర్శలున్నాయి. ఇప్పటికే రైతుబంధు అమలు చేస్తున్న ప్రభుత్వం.. రైతులకు ఇన్‎పుట్ సబ్సిడీ, పంట బీమా ఇవ్వటంలేదు. ఇప్పుడు దళితబంధును ముందుకు తెచ్చిన కేసీఆర్.. మూడెకరాల భూపంపిణీపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భూముల ధరలు పెరిగాయి.. దీంతో దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయాలంటే.. కనీసం ఒక్కో యూనిట్‎కు రూ. 20 నుంచి 25 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీని అమలు చేయలేకే సీఎం మాటమార్చారనే ప్రచారం జరుగుతోంది. కుటుంబమంతా లబ్ధిపొందే మూడెకరాల భూపంపిణీని పక్కనపెట్టి.. దళితబంధు పేరుతో దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.