ప్రయోగాలకు మారుపేరు సింగీతం.. 5 భాషల్లో 61 చిత్రాలు

 ప్రయోగాలకు మారుపేరు సింగీతం.. 5 భాషల్లో 61 చిత్రాలు
  •     చెన్నైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస  
  •     94 ఏండ్ల వయసులోనూ ‘సింగ్‌‌‌‌‌‌‌‌ గీతం’ సినిమాకు డైరెక్షన్ 

  

చెన్నై:  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు(95) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 61 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, మయూరి, మైఖేల్ మదన కామరాజు వంటి ప్రయోగాత్మక సినిమాలతో ఎంతో ఖ్యాతి పొందారు. చివరిసారిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం(2026) అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. 94 ఏళ్ళ వయసులో 61వ సినిమాకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

తెలుగు సినిమాను కొత్త కథలు, కొత్త టెక్నాలజీ, కొత్త జానర్ల వైపు నడిపించిన దర్శకుల్లో ఆయనది ప్రత్యేక స్థానం. దర్శకత్వంతోపాటు, నిర్మాణం, సంగీతం, నటన వంటి విభిన్న కోణాల్లోనూ ఆయన ప్రతిభ చాటారు. సింగీతం శ్రీనివాసరావు 1931, సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా, ఉదయగిరిలో జన్మించారు. భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే నాటకాలు, సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమాల్లోకి రాకముందు టీచర్‌‌‌‌గా పనిచేయడంతో పాటు నాటకాలు రాశారు. పత్రికల్లో వ్యాసాలు సైతం రాశారు. చివరకు సినిమాల పై ఉన్న ఆసక్తితో పట్టుదలగా ప్రయత్నించి దిగ్గజ దర్శ కుడు కేవీ రెడ్డి వద్ద1954లో అసిస్టెంట్‌‌గా చేరారు. ఆయన1972లో ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా మా రారు. తొలిచిత్రం నిరాశపర్చినా ముందుకే సాగారు. తర్వాత ‘దిక్కట్ర పార్వతి’, ‘తరం మారింది’, ‘పంతులమ్మ’ వంటి సామాజిక ఇతివృత్తాలతో 
తనదైన ముద్ర వేశారు. 

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ 

సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు చిరునామాగా మారిన సింగీతం.. కమల్ హాసన్‌‌తో తీసిన పుష్పక విమానం సినిమా సంచలనం సృష్టిం చింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం దృశ్యాలతోనే కథను నడిపించి ఔరా అనిపిం చారు. బాలకృష్ణ హీరోగా టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఆదిత్య 369, జానపద, ఫాంటసీ కథతో తీసిన భైరవద్వీపం, డ్యాన్సర్ సుధా చంద్రన్‌‌ జీవితకథతో వచ్చిన మయూరి వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ప్రధానంగా కమల్ హాసన్‌‌తో ఆయన పుష్పకవిమానం తోపాటు అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు వంటి ప్రయోగాలు సినీలోకాన్ని ఆశ్చర్యపర్చాయి. సింగీతం తన కెరీర్‌‌‌‌లో రెండు జాతీయ పురస్కారాలు, 5 నంది అవార్డులు, పలు ఫిల్మ్‌‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.