
- భయంతో చెట్టెక్కిన పశువుల కాపరి
- నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ పరిధిలో ఘటన
కోటగిరి,వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన ఆవులపై చిరుతపులి దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. పశువుల కాపరి తెలిపిన ప్రకారం.. కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని లింగమయ్య గుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం గంగారాం ఆవులను మేత కోసం తోలుకెళ్లాడు. ఒక్కసారిగా చిరుతపులి ఆవుపై దాడి చేసింది. ఇది చూసిన అతడు భయంతో పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కాడు. ఆవులన్నీ ఎదురుదాడికి దిగడంతో చిరుతపులి భయాందోళకు గురై పారిపోయింది.
దీంతో ఆవులు రోడ్డు వైపు పరుగులు తీశాయి. కొద్దిసేపటికి చెట్టుదిగిన గంగారాం ఆవులను తోలుకుని ఇంటికి చేరాడు. చిరుతపులి దాడి ఘటనను గ్రామస్తులకు చెప్పాడు. గాయపడ్డ ఆవుకు గోపాల మిత్ర రాము చికిత్స చేశాడు. గతంలోనూ ఓసారి లింగమయ్య గుట్ట ప్రాంతంలోని నాగేంద్ర పూర్‌లో ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి కలకలం రేపింది.