
ఎడపల్లి, వెలుగు : పశువుల కొట్టంపై దాడి చేసి మేకలను చిరుత పులి ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎడపల్లి మండలం జానకంపేట్ శివారులోని వ్యవసాయ పొలంలో వెల్మల సందీప్‌కు చెందిన పశువుల కొట్టంలో మేకలను కట్టేశాడు. అటవీలో సంచరించే చిరుత బుధవారం అర్ధరాత్రి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లింది.
మేకలను నోట కరిచి తీసుకెళ్లినది అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. గతంలో కూడా ఇలాగే మరో మేకను చిరుత ఎత్తుకెళ్లిందని రైతు సందీప్ పేర్కొన్నారు. పశువుల కొట్టంపై చిరుత దాడి చేయడం రెండోసారి అని తెలిపాడు. ఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలపడంతో వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరొకటి..
పాలమూరు: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. గురువారం సాయంత్రం గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు సెల్ ఫోన్లలో ఫొటోలు తీశారు. కొద్దిరోజులుగా చిరుత కలకలంతో జిల్లా కలెక్టర్, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ట్రాప్ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేసి స్థానికులను అప్రమత్తం చేశారు, చిరుతను పట్టుకోకపోవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.