- సిద్దిపేట జిల్లాలోని గొడుగుపల్లి వద్ద గుర్తించిన స్థానికులు
- పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే మృతికి కారణాలు తెలుస్తాయన్న ఫారెస్ట్ ఆఫీసర్లు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట – మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేసిన చిరుత చనిపోయింది. మంగళవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో మృతిచెందిన చిరుతను స్థానికులు గుర్తించారు. సమాచారం అందడంతో దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ హైమద్, బీట్ఆఫీసర్ వేణు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
మృతి చెందిన చిరుతకు ఐదేండ్ల వయసు ఉంటుందని నిర్ధారించారు. జంతువులను వేటాడుతూ గాయపడి బలహీన స్థితికి చేరి చనిపోయి ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్లు భావించారు. చిరుత మృతికి కారణాలు తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించి టెస్ట్ లకు ల్యాబ్ కు పంపించారు. చిరుత మృతికి విష ప్రయో గం జరిగిందా..? అనేది టెస్టుల్లో వెల్లడవుతుందని డీఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు.
రెండు రోజుల కింద గొడుగుపల్లి వద్ద రైతు భిక్షపతిపై దాడికి యత్నించిన చిరుత బలహీన స్థితిలో ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. దాని శరీరంపై ఎలాంటి గాయాలు లేక పోవడంతో అనారోగ్యానికి గురైనట్టు చనిపోయి ఉండొచ్చని, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
