
మహబూబ్‌నగర్, వెలుగు: చిరుతపులులు.. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నర నుంచి జిల్లాలో ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. చిరుతలు గ్రామాల శివార్లలో సంచరిస్తుండడం.. శనివారం రాత్రి కోయిల్‌కొండ మండలంలో ముగ్గురిపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఆహారం కోసం అడవిని వదిలి..
పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. ఈ రేంజ్‌ల పరిధిలో దేవరకద్ర, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్, హన్వాడ, మహమ్మదాబాద్, నవాబుపేట ప్రాంతాల్లో ఎక్కువగా గుట్టలు ఉన్నాయి. అలాగే అప్పన్నపల్లి, మైసమ్మ రిజర్వ్ ఫారెస్ట్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రోజుల నుంచే చిరుత పులులు నివాసం ఉంటుండగా.. ఏడాదికాలంగా వీటి సంతతి పెరిగినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం చిరుతలకు మేటింగ్ సీజన్ కావడంతో వాటి సంచారం మరింత పెరిగింది.
నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల గ్రామ శివారులోని దేవరగుట్ట చిరుతలకు స్థావరంగా మారింది. ఈ గుట్టల్లో గుహ ఉండటంతో చిరుత అక్కడే ఉంటుందని, దానితో పాటు రెండు పిల్లలను సైతం చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు ఆఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దొరకడం లేదు. కొన్ని రోజుల కింద గుట్ట చుట్టూ మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి, ఎర వేసినా చిరుత మాత్రం చిక్కలేదు. ఆహారం కోసమే చిరుతలు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని ఆఫీసర్లు
చెబుతున్నారు.
పాలమూరులో ఇంకా చిక్కని చిరుత
పాలమూరు ప్రజలను నెల రోజులుగా చిరుత హడలెత్తిస్తోంది. నగరంలోని వీరన్నపేట శివారులో ఉన్న గుర్రంగుట్ట, తిరుమలదేవుని గుట్ట ప్రాంతంలో తరచూ సంచరిస్తోంది. ఈ ప్రాంతాల్లో గత నెల 30 నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు చిరుత కనిపించింది. ఉదయం, సాయంత్రం టైంలో గుట్టల వద్దకు వచ్చి వెళ్తోంది. ఈ విషయం తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్లు గుట్టల చుట్టూ ట్రాక్ కెమెరాలు, బోనును ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటివరకు చిరుత చిక్కలేదు.
వారం కింద మరోసారి కనిపించడంతో ఆఫీసర్లు వచ్చి డ్రోన్ కెమెరాతో చిరుత కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నాలుగు రోజుల కిందట దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ వద్ద ఉన్న రాతి గుట్టల్లో మరో కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మహమ్మదాబాద్, కోయిల్‌కొండ, కోయిల్‌సాగర్, యన్మన్‌గండ్ల ప్రాంతాల్లోని గుట్టలను ఆనుకొని వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇదే గుట్టల్లో చిరుతలు సంచరిస్తుండడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సాగు పనులు ఊపందుకోవడంతో రైతులకు పొలాలకు వద్దకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. దీంతో ఒంటరిగా కాకుంగా.. ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్లి తమ పనులు చూసుకొని తిరిగి వస్తున్నారు.