తిరుమల నడక దారిలో చిరుత దాడి కలకలం..50 సీసీ కెమెరాలు.. నాలుగు బోన్లు

తిరుమల నడక దారిలో చిరుత దాడి కలకలం..50 సీసీ కెమెరాలు.. నాలుగు బోన్లు

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత  దాడి వార్త కలకలం రేపుతోంది. భక్తుల్లో భయాందోళనలు మొదలైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం  భద్రతా చర్యలు పటిష్ఠం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.నడక దారిలో చిన్నారి కౌశిక్ పై దాడి చేసిన చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ అదే ప్రాంతంలో చిరుత దాడి చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తు చేశారు. చిరుతను బంధించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50 చోట్ల సీసీ కెమెరాలను పెట్టి చిరుతను బంధించేందుకు నాలుగు బోన్లను కూడా సిద్ధం చేశారు

బిక్కుబిక్కు మంటున్న భక్తులు

చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో నడక దారిలో కొడపైకి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని భక్తులు భయంతో వణికిపోతున్నారు. భక్తులకు భద్రతగా టీడీడీ సిబ్బంది ఉన్నప్పటికీ భక్తుల్లో ఆందోళన తగ్గలేదు. చాలా మంది కొండపైకి చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నట్టు తెలుస్తోంది.చిరుతను బంధించే వరకు ఇదే ఆందోళన ఉంటుందని టీడీడీ సిబ్బందిచెబుతున్నారు. అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా కొండపైకి చేరుకోవాలని సూచిస్తున్నారు.

ఇరువైపులా కంచె?

నడకదారికి ఇరువైపులా పూర్తిస్థాయిలో కంచెను నిర్మించడం ... సాయంత్రం 6 తర్వాత నడకదారిని బంద్ చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు. ఈ రెండు అంశాల అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యల తీసుకోవడం గురించి యోచిస్తున్నామని తెలిపారు.

చిన్నారికి సుబ్బారెడ్డి పరామర్శ

చిరుత దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కౌశిక్ ను శుక్రవారం (జూన్ 23)  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు.  బాలుడికి ప్రాణాపాయం లేదని..ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ఆ స్వామివారి దయవల్లే చిరుత దాడి నుంచి బాబు ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు.పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.