రోగులకు ఉండే హక్కులు ఏమిటి?

రోగులకు ఉండే హక్కులు ఏమిటి?

దవాఖానాలపైనా ప్రజలు రోజురోజుకూ నమ్మకం కోల్పోతున్నారు. కారణం వైద్యులు వ్యాపారస్తులుగా మారిపోవటం, వైద్యాన్ని వ్యాపారంగా మార్చివేయటం. ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు అందించాలనే కనీస బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించడంతో  వైద్యరంగంలోకి  ప్రైవేటు పెట్టుబడులు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో  రోగులకుండే హక్కులేంటి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రోగుల హక్కులకు సంబంధించి 17 నిబంధనలతో కూడిన చార్టర్ ను విడుదల చేసింది. ఒక రోగికి ఇవ్వాల్సిన ఆరోగ్య భద్రత గురించి రూపొందించిన నియమాలు ఈ చార్టర్‌‌‌‌లో ఉంటాయి. కేంద్ర వైద్య శాఖ ప్రధానంగా17 హక్కులను పొందుపరిచింది. 

 •     రోగికి అనారోగ్యం కారణం, లక్షణం, చికిత్స, వైద్య పరీక్షలు, ఇతర సమస్యలను వైద్యుడిని అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది. చికిత్స చేసే డాక్టర్ అర్హతలను కూడా రోగి లేదా రోగి కుటుంబ సభ్యులకు తెలుసుకునే అధికారం ఉంటుంది. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగి రోగి ప్రాణాలు కోల్పోయినప్పుడు లేదా సరైన చికిత్స చేయలేనప్పుడు  క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. చికిత్స తీసుకుంటుండగా వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగి రోగి మరణిస్తే ఐపీసీ సెక్షన్ 304ఎ అనుసరించి డాక్టరును అరెస్టు చేయవచ్చు. ఈ నేరానికి రెండేండ్లు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండు కలిపి విధించే అవకాశముంది. 
 •     రోగి లేదా రోగిని చూసుకునే సంరక్షకులకు  కేసు పత్రాలు, రికార్డులు, వైద్య పరీక్షల రిపోర్టులు అడిగే హక్కు ఉంటుంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటలు నుంచి 72 గంటలలోపు వీటిని తీసుకోవచ్చు. తగిన ఫీజు చెల్లించిన తర్వాత వీటిని పొందే హక్కు ఉంటుంది.
 •     ప్రమాదాల్లో గాయపడినవారికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ అత్యవసర చికిత్సను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో  రోగి నుంచి అడ్వాన్స్ చెల్లించమని డిమాండ్ చేయకూడదు.
 •     రోగి ఫీజు చెల్లించే సామర్థ్యానికి అతీతంగా వైద్య సేవలను అందించాల్సి ఉంటుంది. 
 •     రోగికి చికిత్స ఇచ్చేందుకు, ముఖ్యంగా ప్రాణాంతక సమస్యలకు చికిత్స అందిస్తున్న సమయంలో రోగి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కీమోథెరపీ లాంటి చికిత్సల్లో రోగి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ అనుమతిని  రాతపూర్వకంగా తీసుకుని చికిత్స మొదలుపెట్టాలి. 
 •     రోగులందరికీ తమ వివరాలను గోప్యంగా ఉంచమని అడిగే హక్కు ఉంటుంది.  ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు తప్ప వేరే ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్టర్లు రోగి ఆరోగ్య పరిస్థితి గురించి బహిరంగంగా వెల్లడి చేయకూడదు.
 •     ఒక స్త్రీకి పురుష డాక్టర్ చికిత్స అందిస్తున్న సమయంలో మరొక మహిళను తన పక్కనే ఉండమని చెప్పే హక్కు కూడా మహిళలకు ఉంటుంది.
 •     ప్రతి రోగి తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌‌‌‌తో పాటు, మరొక డాక్టర్‌‌‌‌ను కూడా సంప్రదించే హక్కు ఉంటుంది. ఆస్పత్రి యాజమాన్యం రోగికుండే ఈ హక్కును గౌరవించాలి. ఇలాంటప్పుడు యాజమాన్యాలు రోగికి అవసరమైన వైద్యపరమైన రికార్డులన్నిటినీ ఎటువంటి జాప్యం చేయకుండా ఇవ్వాలి. 
 •     ఆస్పత్రి యాజమాన్యం వివిధ రోగాల చికిత్సకు తీసుకునే చార్జీల విషయంలో పారదర్శకత ఉండాలి. ఆస్పత్రిలో లభించే సౌకర్యాలు డిస్‌‌‌‌ప్లే బోర్డు, బ్రోచర్‌‌‌‌లో ఉంచాలి.  ఫీజు చెల్లిస్తున్నప్పుడు ఆస్పత్రి అందించిన ప్రతి సేవకు వివరంగా బిల్లు ఉండాలి. ఆస్పత్రి వివక్షతో ప్రవర్తిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. 
 •     రోగికి రోగం, స్థాయి, మతం, కులం, లింగం, వయసు, భాష, ప్రాంత భేదాలు చూపించకుండా చికిత్సను అందించాలి. 
 •     ఆస్పత్రిలో రోగులకు కల్పించే భద్రత, రక్షణ గురించి అడిగే హక్కు రోగులకుంటుంది. ఆస్పత్రిలో పాటించే పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు సోకకుండా తీసుకునే చర్యలు గురించి తెలుసుకోవడంతో పాటు, పరిశుభ్రమైన నీరు అడిగే హక్కు కూడా ఉంటుంది. 
 •     రోగి ఆస్పత్రిలో తీసుకుంటున్న చికిత్సతో పాటు ప్రత్యామ్నాయ చికిత్సను అడిగే హక్కు కూడా ఉంటుంది. అయితే, ఇందుకు పూర్తి బాధ్యతను రోగి, బంధువులు లేదా కుటుంబ సభ్యులు వహించాల్సి ఉంటుంది. ఔషధాలు, వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అధికారం కూడా రోగులకుంటుంది.
 •     ఆస్పత్రిలో వైద్యులు రోగులకు ఔషధాలను సూచించినప్పుడు అవి రిజిస్టర్డ్ సంస్థల నుంచి కొనుక్కునే అధికారం రోగికి ఉంటుంది. 
 •     రోగి చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచి వేరే ఆస్పత్రికి మారినా కూడా ముందుగా చేరిన ఆస్పత్రి నుంచి చికిత్సను పొందే హక్కు ఉంటుంది.
 •     క్లినికల్ ట్రయల్స్ లో  పాల్గొంటున్న రోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలి. క్లినికల్ ట్రయల్స్ ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి.
 •     బయోమెడికల్, హెల్త్ రీసెర్చ్‌‌‌‌లో  పాల్గొంటున్నవారికి తగిన భద్రత కల్పించాలి.
 •     ఆస్పత్రిలో ఫీజు చెల్లించలేదని రోగులను ఆస్పత్రిలో బంధించి ఉంచేందుకు వీలులేదు.  ఇదే నిబంధన చనిపోయినవారికి కూడా వర్తిస్తుంది. రోగి మృతదేహాన్ని ఆస్పత్రిలో బంధించి ఉంచేందుకు లేదు.
 •     రోగికున్న హక్కులు, ఇన్సూరెన్సు పథకాలు గురించి రోగికి, కుటుంబ సభ్యులకు తెలియచేయాలి.

 

- మన్నారం నాగరాజు,
సోషల్​ ఎనలిస్ట్​