అవినీతి సర్కారును గద్దె దించుదాం

అవినీతి సర్కారును గద్దె దించుదాం

కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపు
పార్టీ ఆఫీసులో దీన్‌ దయాళ్‌ జయంతి వేడుక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కలసికట్టుగా పని చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. విలువలతో కూడిన పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉందన్నారు. పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన పండిట్ దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఫొటోకు లక్ష్మణ్‌, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి సహా పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీజేపీ శాఖలు సేవా సంస్థలుగా మారాలని దీన్ దయాళ్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. పార్టీ, కార్యకర్తలు రాజకీయాలకే పరిమితం కాకుండా పేద వారికి సేవ చేయాలని కోరుకునేవారన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. దీన్ దయాళ్ బాటలోనే ప్రధాని మోడీ నడుస్తున్నారని, అందుకే పేదల కళ్లల్లో ఆనందం నింపుతున్నారని పొగిడారు.

పార్టీలో ‘ఏకాత్మత’ను స్టార్ట్‌ చేశారు

బీజేపీ ఏర్పాటయ్యాక ఏకాత్మతా మానవతా విధానాన్ని పార్టీలో దీన్ దయాళ్ ప్రవేశపెట్టారని, యువతను ఆకర్షించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగ పడిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలను శాసించేలా బీజేపీ ఎదిగిందంటే ఏకాత్మతా విధానమే కారణమన్నారు. కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి  రాబోతుందని జోస్యం చెప్పారు. తానిప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానని, ఏ అడ్డు లేదని అన్నారు.

ఢిల్లీలో దీన్ దయాళ్ జయంతి వేడుకలు

బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104 వ జయంతి వేడుకలు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.