ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చినవాళ్లకు .. స్థానిక ఎలక్షన్స్​లో చాన్స్​

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చినవాళ్లకు .. స్థానిక ఎలక్షన్స్​లో చాన్స్​
  • కాంగ్రెస్​ కార్యకర్తలకు సీఎం రేవంత్ ​రెడ్డి హామీ
  • రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు వచ్చేలా కష్టపడుదాం
  • లోక్​బాడీ ఎన్నికలైపోతే ఆ తర్వాత ఎలక్షన్స్​ లొల్లి ఉండదు
  • కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీల్లో వాలంటీర్లుగా అవకాశం కల్పిస్తం
  • ఒక్కొక్కరికి రూ. 6 వేల దాకా గౌరవ వేతనం ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  లోక్ సభ ఎన్నికలు అయిపోగానే జూన్​ ఫస్ట్​ వీక్​లో  స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘జూన్ చివరి వారంలో సర్పంచులు, ఎంపీటీసీల, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తే, ఇక రాష్ట్రంలో ఎన్నికల లొల్లి అనేది ఉండదు. మిగితా నాలుగున్నరేండ్లు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టొచ్చు” అని చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేసి, తమ బూత్​లలో పార్టీకి మెజార్టీ తీసుకువస్తే.. వారినే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మిగితా వాళ్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలకు వాలంటీర్లుగా నియమిస్తామని, ఒక్కొక్కరికి సుమారు రూ. 6 వేల దాకా గౌరవ వేతనం ఇద్దామని అన్నారు. 

ఈ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యకర్తలు లోక్​సభ ఎన్నికల్లో బాగా కష్టపడాలని ఆయన సూచించారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్​సభ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగింది. దీనికి సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఇందులో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్​చార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులతో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ఎంపీ ఎన్నికలు అయిపోగానే, ఆ వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఇక ఎన్నికల హడావుడి ఉండదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల బూత్ కమిటీలు ఉన్నాయని, ప్రతి బూత్ లో కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 పైగా ఎంపీ సీట్లు వస్తాయని ఆయన తెలిపారు. ఈ విషయాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేని నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్​చార్జులు బూత్ ల వారీగా పార్టీ కార్యకర్తలకు వివరించాలని సూచించారు. 

ఫూలే స్ఫూర్తితోనే కార్యక్రమాలు

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సీఎం రేవంత్ ​రెడ్డి అన్నారు. గురువారం ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త అని అన్నారు.తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్​ను మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్​గా మార్చినట్టు తెలిపారు. ఫూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.