- ‘వార్షిక 2025’ పుస్తకాన్ని రిలీజ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువత ప్రభుత్వ ఉద్యోగ కలలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించేందుకు అవసరమైన ఉచిత శిక్షణను, మెలకువలను అందిస్తూ ‘మేధో తెలంగాణ’ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రూపొందించిన పోటీ పరీక్షల ప్రత్యేక పుస్తకం ‘వార్షిక 2025’ ను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కొరత లేకుండా ఉండేందుకు ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి వార్తలు, విశేషాలు, వ్యక్తుల సంఘటనలకు సంబంధించిన సమాహారంగా ఈ పుస్తకాన్ని రూపొందించామని చెప్పారు. రాబోయే దేవాదాయ శాఖ ఉద్యోగాలకు ఉపయోగపడేలా ‘భారతీయ వైదిక హైందవ విజ్ఞానం’ పేరుతో ప్రత్యేక సమాచారాన్ని అందించామని పేర్కొన్నారు.
