తెలుగునాట వేమన గురించి తెలియని ప్రజలుండరు. ప్రజల సాంస్కృతిక వారసత్వంలో బలమైన ప్రాతినిధ్యం వేమన్నది. అందుకే
కవానకు తడియని వాడును
పూనిక వేమన బోధ బొరయని వాడున్
నానా దిక్కుల వెదకిన
కానమురా కుందవరపు కవి చౌడప్పా! అంటాడు మరో శతకకవి చౌడప్ప. అంతగా ప్రజల జీవితాలను వేమన మాత్రమే ఎలా ప్రభావితం చేయగలిగాడు? వేమనకు ముందూ వెనుక చాలా మంది కవులున్నారు. వారెవరికీ లేని ప్రఖ్యాతి వేమనకే ఎందుకు దక్కింది? దానికి ప్రధానమైన కారణం వేమన దృష్టికోణం.
ఈయన రాసిన కవిత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాసింది. మిగిలిన కవులది పురాణేతిహాసాల దృష్టికోణం. వారు ప్రజలను విడిచిపెట్టి మానవాతీత సాహిత్యం రాశారు. కేవలం రాజుల వైభోగాలకు మాత్రమే అంకితమైన కవిత్వం రాశారు.
రాజులకు, రాణులకు ఇష్టమైన దేవీ దేవతల కథల నెపంతో పచ్చి శృంగారాలను రాశారు. సామాన్య మానవుని జీవితాన్ని కానీ అందులోని కష్టసుఖాలను కానీ పట్టించుకున్న వారే లేరు. ఆ కవులందరికీ భిన్నమైన వాడు వేమన. ఆయన తన కళ్లముందు రక్తమాంసాలతో కదులుతున్న తనలాంటి మనుషుల కోసం కవిత్వం రాసాడు.
సమాజంలో పేరుకుపోయిన కుళ్లును ప్రశ్నించాడు. ప్రజల నైతిక ప్రవర్తనలో మార్పు కోసం కలం పట్టాడు. వేమన17వ శతాబ్ధికి చెందిన కవి. ఆయన జీవించిన కాలం కూడా రాజుల కాలమే. రాచరిక వ్యవస్థలో ఉండే దోపిడీ, కులదౌర్జన్యాలు, అవిద్య, స్త్రీల పట్ల హింస లాంటి పరిస్థితులు వేమన్న ఆలోచనాధోరణి మీద ప్రభావం చూపాయి.
ఆనాటి మిగిలిన కవుల వలె రాజ్యం వైపు నిలబడలేదు వేమన. ప్రజల వైపు నుంచి ఆలోచించాడు కాబట్టే ఆనాటి రాచరిక వ్యవస్థను అసహ్యించుకున్నాడు. ఈ నేపధ్యంలోనే..
ఎరుక లేని దొరల నెన్నాళ్లు గొలిచినా
బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని
గొడ్డుటావు పాలు, గోకితే చేపునా..- అంటాడు. వేమన ఆశించిన ఆ ‘ఎరుక’ ప్రజాసంబంధి. అట్లాంటి ఎరుక ఆనాటి పాలకులకు లేకపోవడం మూలంగానే ఆయన రాజ్య వ్యవస్థకు దూరంగా ఉన్నాడు. అందుకే నిత్యం ప్రజల్లోనే ఉండి ఆ ప్రజలను తన పద్యాలతో మేలుకొల్పే ప్రయత్నం చేశాడు. కులం, మతం అనే భావనల పట్ల ఆనాడే విమర్శనాత్మకంగా ఆలోచించి ఆ వ్యవస్థ పట్ల మొట్టమొదటిసారిగా ధిక్కారస్వరాన్ని వినిపించిన సామాజిక సంస్కర్త వేమన.
తనువులోన యాత్మ తత్వమెఱుంగక
వేరె కలడటంచు వెదుకడెపుడు
భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? అన్నది వేమన తత్వం. మతాల మధ్య వైరుధ్యాలు ఏర్పడి సంఘర్షిస్తున్న కాలంలో దేవుడెక్కడో లేడని ‘ఆత్మ’లోనే ఉన్నాడని చెప్పాడు. ఈ రకంగా ఆనాటి ప్రజల మతభావనలను సంస్కరించే ప్రయత్నం చేశాడు.
మాల వానినంటి మరినీట మునిగేరు
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగునో? అని మనుషులు కులాలపట్ల అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగడతాడు. తన కాలంలో ప్రజల్ని అజ్ఞానంలోకి నెడుతున్న సమస్త అంశాల పట్ల సునిశిత విమర్శ చేశాడు. తన చేతిలోని పద్యాన్ని దివిటీగా మార్చి ఆనాటి చీకటి ప్రపంచానికి వెలుగందించే ప్రయత్నం చేశాడు.
వేమన కాలంనాటికి తెలుగు సాహిత్యానికి ఏడు వందల ఏళ్లు. అంత సుదీర్ఘ కాలంలో ప్రజల బాగోగులను పట్టించుకున్న తెలుగు కవులెవరూ లేరు. వాళ్ల సాహిత్యం రాజుల కోసం. వాళ్లు నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేయటం కోసం. అంతేకాని ప్రజలకు మంచి ఏదో చెడు ఏదో చెప్పుదామని ఎవరూ కూడా ముందుకురాలేదు. ప్రజల కోసం మొట్టమొదటిసారిగా కలం పట్టిన తెలుగుకవి వేమన. అందుకే ఆయనను మొట్టమొదటి ప్రజాకవిగా గుర్తించొచ్చు.
- తోకల రాజేశం-
