సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర ..కలిసి పోరాడుదాం.. TRSకు మీ ఆశీర్వాదం కావాలి: కవిత

సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర ..కలిసి పోరాడుదాం.. TRSకు మీ ఆశీర్వాదం కావాలి: కవిత


అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను రద్దు చేసి, ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను పెంచుతూ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. కొత్త బొగ్గు బావులు తెచ్చుకుంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, మన హక్కైన డిపెండెంట్ ఉద్యోగాల కోసం రాజీలేని పోరాటం చేయాల్సి ఉందన్నారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. వెంటనే సింగరేణికి బకాయి ఉన్న 50 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మంచిర్యాల జిల్లాలో చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా.. కాసిపేట మైన్-1ను ఆమె సందర్శించారు. నేరుగా గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాసిపేట నుంచే వారం రోజుల పాటు సాగనున్న ఈ ‘బాయి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన టిఆర్ఎస్ కు సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కావాలి అని ఆమె కోరారు.

తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మనం కలిసి పనిచేశాం. నేను ఎక్కడున్నా అనునిత్యం మీ పక్కనే ఉండి పోరాడాను. గతంలో మెడికల్ బోర్డు కోసం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించిన చరిత్ర మనది. కానీ ఈ ప్రభుత్వంలో.. సర్వసాధారణంగా జరగాల్సిన పనుల కోసం కూడా కార్మికులు రోడ్డెక్కి పోరాడాల్సి వస్తోంది అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఉండి సింగరేణికి కొత్త బొగ్గు బావులు తేవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఇక్కడికి వచ్చి కార్మికులకే వినతిపత్రాలు ఇస్తూ మభ్యపెడుతున్నారని కవిత మండిపడ్డారు. ఐటీ సమస్యలను తీర్చడంలో, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఇప్పుడున్న కార్మికుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారని.. కానీ వారి పిల్లల చదువుల కోసం సరైన స్కూళ్లు, వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులు లేవని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటిలో ప్రైవేట్‌ను తీసుకొచ్చి వైద్యాన్ని ఖరీదు చేస్తున్నారని మండిపడ్డారు.

అందుకే.. కార్మికుల రక్షణ కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం ‘తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం’ అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందని కవిత ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ స్థాయిలో, జేబీసీసీ (JBCCI)లో కార్మికుల హక్కుల కోసం హెచ్.ఎమ్.ఎస్. (HMS) అధ్యక్షుడు రియాజ్‌తో కలిసి టిఆర్ఎస్. సంయుక్తంగా, రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త పార్టీ స్థాపించాక సింగరేణిలో ఇదే తన మొదటి యాత్ర అని పేర్కొంటూ.. కార్మికుల దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని  కవిత కాంక్షించారు.