ఎకో టూరిజాన్ని డెవలప్‌‌ చేద్దాం ... అధికారులతో మంత్రి సురేఖ రివ్యూ

ఎకో టూరిజాన్ని డెవలప్‌‌ చేద్దాం ...  అధికారులతో మంత్రి సురేఖ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలగకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆమె సెక్రటేరియట్‌‌లో ఎకో టూరిజంపై అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించామన్నారు. అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ,  దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ, అడ్డంకులను అధిగమించాలని సూచించారు.  ఎకో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేసేందుకు పీపీపీ పద్ధతిలో నిధులను సమీకరించాలన్నారు. నదీపరివాహక ప్రాంతాలు, జలపాతాలు వంటి ఏరియాలో స్పాట్లకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ఆయా పర్యాటక ప్రదేశాల్లో స్థానికులకు, మహిళా సంఘాలకు ఉపాధిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సురేఖ పేర్కొన్నారు.