కార్పొరేట్  కాలేజీలు మూసేసేదాకా పోరాడదాం

కార్పొరేట్  కాలేజీలు మూసేసేదాకా పోరాడదాం
  • బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్: కేవలం 3 నెలలు కాలేజీలు నడిపి విద్యార్థుల ముక్కుపిండి పూర్తి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీల భరతం పట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఓయూలో తెలంగాణలో కార్పొరేట్ సంస్థల విద్యా విధ్వంసం- అధ్యాపకుల ఆత్మగౌరవం అనే అంశంపై జ‌రిగిన‌ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీలపై అనేక పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కార్పొరేట్ కాలేజీల ఆగడాలు మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను, ఉపాధ్యాయులను పీల్చిపిప్పి చేస్తున్నాయని.. పైగా పనిచేస్తున్న లెక్చరర్లకు జీతాలు ఇయ్యకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు. కాలేజీల ముందు ధర్నాలు చేస్తూనే మానవ హక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమీషన్లకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. కాలేజి యాజమాన్యాలపై చర్యలు తీసుకునేలా ఇంటర్మీడియట్ బోర్డ్, మంత్రి పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి- కార్పొరేట్ కాలేజీల మధ్య రహస్య ఒప్పందాలున్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అడ్మిషన్లప్పుడు ఒకలా టీసీలు ఇచ్చేటప్పుడు ఒకలా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న శ్రీచైతన్య, నారాయణ, గాయత్రీ కాలేజీలను మూసేసేదాకా పోరాడుదామని ఆర్.కృష్ణయ్య కోరారు. ‘‘ప్రభుత్వ పెద్దలకు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలలో వాటాలున్నాయి.. సంతకం పెట్టడం రానోళ్లు కూడా మంత్రులుగా ఉన్నారు.. అసెంబ్లీ లో గొర్రెల్ల చేతులు ఎత్తేటోళ్లే ఉన్నారు.. అందుకే కార్పొరేట్ కాలేజీలు పట్టపగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి.. ఒక్క కాలేజీకి 400 వందల శాఖలు ఎలా  అనుమతులు ఇస్తున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలి.. అధ్యాపకుల ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది..’’ అని ఆర్. క్రిష్ణయ్య స్పష్టం చేశారు.

For More News..

కేసీఆర్ కోటనే కొట్టా.. ఆ కాలేజీలు ఓ లెక్కా?

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాతృభాషపై ప్రేమ లేదు

శ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు

విమానం ఇంజిన్‌లో మంటలు.. వీడియో తీసి పోస్ట్ చేసిన ప్రయాణికుడు