కరోనా హాలీడేస్: ఇలా వాడుకుంటే ఆల్ హ్యపీస్

కరోనా హాలీడేస్: ఇలా వాడుకుంటే ఆల్ హ్యపీస్

సెలవులొస్తే చాలు ఎగిరి గంతేస్తాం. ఎక్కడికెళ్దామా.. అని ప్లాన్స్​ వేసుకుంటాం. సినిమాలు, షికార్లు, టూర్లు, పార్టీలు.. ఏది కుదిరితే అది చేయడానికి రెడీ. సెలవులొచ్చాయ్​… ఎవరూ ఎగిరి గెంతడం లేదు. ఎక్కడికెళ్దామనే ముచ్చటే లేదు. సినిమాలు, షికార్లు, టూర్లు, పార్టీలు.. ఏదీ ప్లాన్​ చేయడంలేదు. ఎందుకంటే.. ఇప్పుడొచ్చిన సెలవులు ఎప్పుడూ వచ్చేవి కావు. ఇవి ‘కరోనా’ హాలిడేస్​. మరి ఈ పది పదిహేను రోజులు ఏం చేద్దాం?

నిజమే.. ప్రాబ్లమ్​ వచ్చాక ఇబ్బంది పడేకంటే, రాకముందే జాగ్రత్తగా ఉండాలి. కరోనా వంటి అంటువ్యాధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. అందుకోసమే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. సినిమా హాల్స్​, ఫంక్షన్​ హాల్స్​ కూడా బంద్ పెడుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల స్టూడెంట్స్​కు, సినిమా హాల్స్​లో పనిచేసే సిబ్బందికి సెలవులొచ్చాయి.  అయితే ఈ సెలవులను మిగతా సెలవుల్లాగే ఎంజాయ్​ చేయడానికి లేదు. వీలైనంతగా ఇంటికే పరిమితం కావడానికే సెలవులు ఇచ్చారు. సెలవులు దొరికాయి కదా అని ఏవేవో ప్లాన్​ చేసుకుంటే లేనిపోని సమస్యలు రావొచ్చు. అందుకే ఇంట్లో ఉండడానికి దొరికిన ఈ సమయాన్ని చక్కగా వాడుకోవచ్చు. ఎట్లనంటే..

‘హోంవర్క్’​ చేద్దాం

తీరిక లేకనో, పనిఒత్తిడి కారణంగానో ఎన్నో పనులు వాయిదా వేస్తుంటాం. ఇల్లు సర్దుకోవడం, పాతబట్టలు పక్కకు తీసేద్దామనుకోవడం, బుక్​ షెల్ఫ్​ను సెట్​ చేసుకోవడం, ఇంటిని డెకొరేట్​ చేసుకోవడం.. చిన్న చిన్న రిపేర్లు ఏమైనా అవసరముంటే దొరికిన ఈ సమయంలో అవన్నీ కంప్లీట్​ చేసుకోవచ్చు.

బుక్స్​ చదువుదాం

బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసే గొప్ప పని పుస్తకాలు చదువుకోవడం. మంచి పుస్తకమని కొనుక్కొచ్చి షెల్ఫ్​కే పరిమితం చేసిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. వాటిని ఈ టైంలో బయటకు తీసి చదివేయొచ్చు. ఒకవేళ రాసే ఆసక్తి ఏదైనా ఉంటే కూడా ప్రయత్నించడానికి ఇదే మంచి టైం.

గార్డెనింగ్​

గార్డెనింగ్​ కొంచెం ఓపికగా చేయాల్సిన పని. పైగా ఒక్కరోజులో పూర్తయ్యే పనికూడా కాదు. ఒకరోజు మొక్కలు నాటి, మరుసటి రోజు నుంచి పట్టించుకోకుండా ఉంటే లాభం లేదు. కనీసం ఓ పదిరోజులపాటైనా వాటి బాగోగులు చూసుకోవాలి. అందుకు ఇప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు.

సెలవు పెట్టొచ్చు

పిల్లలకే సెలవులిచ్చారు.. ఉద్యోగాలు తల్లిదండ్రులకు మాత్రం రెగ్యులర్​ డ్యూటీనే ఉంటుంది. అలాంటివాళ్లు ఉన్న సెలవుల్లో కొన్నింటిని ఇప్పుడు వాడుకోవచ్చు. ఒకవేళ పేరెంట్స్​ ఇద్దరికీ ఒకేసారి సెలవులు దొరికే అవకాశం లేకపోతే ఒకరు కొన్నిరోజులు, మరొకరు ఇంకొన్నిరోజులు సెలవులు పెట్టాలి. అప్పుడు పిల్లల్ని ఒంటరిగా ఉంచిన ఫీలింగ్​ ఉండదు. పిల్లలతో టైం గడిపినట్టూ ఉంటుంది.

కొత్తగా ఏమైనా నేర్చుకుందాం

సంగీతం, డ్రాయింగ్​, పెయింటింగ్​ వంటివి కాకపోయినా.. కొత్త వంటలు నేర్చుకోవడానికి కూడా ఇది చాలా మంచి టైం. పైగా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్లకూ కొత్తగా ఏదైనా చేసిపెట్టినట్లు ఉంటుంది. కావాలనుకుంటే కుకింగ్​లో వాళ్ల హెల్ప్​ కూడా తీసుకోవచ్చు. అంతేకాదు.. కుట్లు, అల్లికలు వంటివి కూడా నేర్చుకోవచ్చు.

పిల్లలకు ఏదైనా నేర్పడానికి

స్కూల్​ డేస్​లో హోంవర్క్​తోనే పిల్లలకు సరిపోతుంది. ఇక వాళ్లకు కొత్తగా ఏదైనా నేర్పుదామంటే టైం ఎక్కడిది. కానీ ఇప్పుడు టైం దొరికింది. కంట్రీస్​ అండ్ క్యాపిటల్స్​ పేర్లు నేర్పుతారో, ఏదైనా మంచి పాట నేర్పుతారో లేదంటే కథలు చెబుతారో మీ ఇష్టం. పిల్లలకు నచ్చినవి చెప్పొచ్చు.