ఆర్టీసీ సమ్మె: హైకోర్టు తీర్పు వచ్చే వరకూ చూద్దాం

ఆర్టీసీ సమ్మె: హైకోర్టు తీర్పు వచ్చే వరకూ చూద్దాం
  • ఆర్టీసీపై రివ్యూలో సీఎం కేసీఆర్

ఆర్టీసీపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలనుకుంటోంది సర్కార్. క్యాంప్ ఆఫీసులో ఆర్టీసీపై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. చర్చల నుంచి జేఏసీ నాయకులే బయటకు వెళ్లారని అధికారులు చెప్పడంతో.. అదే అంశాన్ని కోర్టుకు చెప్పాలన్నారాయన. ప్రత్యామ్నాయంపై ఆరా తీసి.. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

సీఎం రివ్యూలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చర్చలు, కోర్టుకు నివేందించాల్సిన అంశాలపైనా సమావేశంలో చర్చ జరగినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యానికి, జేఏసీకి మధ్య జరిగిన చర్చల్లో.. జేఏసీ నాయకులే బయటకు వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దాంతో ఇదే అంశాన్ని కోర్టుకు చెప్పాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

విలీనం డిమాండ్ కోర్టులో వదులుకుని.. ఇప్పుడేంటిలా?

సమీక్షలో కార్మిక నేతలపై మరోసారి  సీఎం ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను హైకోర్టులో వదులుకుని.. ఇప్పుడదే విషయంపై పట్టుపట్టడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్మిక నాయకుల తీరు సరిగా లేదని… ఆర్టీసీని కార్మిక నేతలు ముంచుతున్నారని అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. విధుల్లో చేరేందుకు ధరఖాస్తు చేసుకోవాలని చెప్పిన తర్వాత.. ఎవరైనా ధరఖాస్తు చేసుకున్నారా అని ఆరా తీశారు సీఎం. కార్మికులు కూడా యూనియన్ నేతల్నే గుడ్డిగా నమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తీర్పు వచ్చాక నిర్ణయం

ఆర్టీసీ నేతలు మొండి పట్టుదలకు పోతున్నారని అధికారులతో చెప్పిన సీఎం.. కోర్టు చెప్పేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.  సమ్మె కొనసాగినా లెక్క చేయాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి.. అద్దె బస్సులు, ప్రత్యామ్నాయంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వస్తే తీసుకోవాలని చెప్పారు. బస్సులాపితే కేసులు పెట్టాలన్నారు.  తాత్కాలిక ఉద్యోగులు బస్సుల్లో టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.