సీఎం యోగికి రక్తంతో లేఖ.. ప్రిన్సిపాల్ వేధిస్తున్నడని విద్యార్థినుల ఫిర్యాదు

సీఎం యోగికి రక్తంతో లేఖ.. ప్రిన్సిపాల్ వేధిస్తున్నడని విద్యార్థినుల ఫిర్యాదు

ఘజియాబాద్ : స్కూల్ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఘజియాబాద్​లోని ఓ స్కూల్ విద్యార్థినులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు రక్తంతో లేఖ రాశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రిన్సిపాల్ రాజీవ్ పాండే ఏదో ఒక సాకుతో అమ్మాయిలను తన ఆఫీస్​కు రమ్మని పిలిచి, వాళ్లను అనుచితంగా తాకుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 12 నుంచి 13 ఏండ్ల మధ్య వయసున్న ఈ స్టూడెంట్లు మొదట ఈ విషయాన్ని చెప్పేందుకు భయపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన మారకపోవడంతో తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. 

ప్రిన్సిపాల్​ను చితకబాదిన్రు

పిల్లలతో కలిసి తల్లిదండ్రులంతా స్కూల్​ వద్ద ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ రాజీవ్​ను నిలదీశారు. ఈ సమయంలో విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్​కు దేహశుద్ధి చేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు తల్లిదండ్రులతో పాటు రాజీవ్​పైనా కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమకు అన్యాయం జరుగుతోందని, ప్రిన్సిపాల్​పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్లు యోగికి రక్తంతో లేఖ రాశారు. ‘ప్రిన్సిపాల్ వేధింపులకు గురవుతున్న మేమంతా మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాం. మిమ్మల్ని కలిసేందుకు మాకు, మా తల్లిదండ్రులకు అపాయింట్​మెంట్ ఇవ్వండి. మేమంతా మీ బిడ్డలమే, మాకు న్యాయం చేయండి”అని లేఖలో పేర్కొన్నారు.