
- ముదురుతున్న గులాబీ లొల్లి
- నిన్న మా పార్టీలో దయ్యాలున్నాయన్న కవిత
- ఇవాళ రేవంత్ కోవర్టులుండొచ్చన్న కేటీఆర్
- కవిత పేరు ప్రస్తావించకుండా ప్రెస్ మీట్
- కవిత లేఖ లీక్ పై వేసిన ప్రశ్నలకు నో ఆన్సర్
హైదరాబాద్: గులాబీ కారులో లొల్లి తారస్థాయికి చేరింది. పేర్లు చెప్పకుండానే విమర్శించుకునేదాకా వెళ్లింది. కవిత రాసిన లేఖ బయటికి రావడం సంచలనంగా మారింది. ఎర్రవల్లి సభపై గ్రౌండ్ రిపోర్టు పేరుతో అధినేత కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ మొన్న వార్తలో నిలిచింది. నిన్న అమెరికా నుంచి వచ్చిన కవిత శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ తానే రాశానని క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీకైతే ఇక పార్టీలోని సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలని అన్నారు.తాను అలా చాలా లేఖలు రాశానని, ఎవరు బయటపెట్టారన్నది తేలాలని అన్నారు. కేసీఆర్ దేవుడని అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. వాళ్ల కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడకపోవడమే మంచిదన్నారు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని, శని కాంగ్రెస్ పార్టీ అంటూ టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేశారు. కవిత లేఖలో ప్రస్తావించిన అంశాలపై విలేకరులు అడుగగా దాట వేశారు. ఆమె పేరును కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆమె రాసిన లెటర్ ఎలా లీకైందన్న ప్రశ్నకూ సమాధానం చెప్పక పోగా రేవంత్ కోవర్టులు ఉండొచ్చన్నారు. దీంతో ఎవరు రేవంత్ కోవర్టులు అన్నది చర్చనీయాంశంగా మారింది.
ALSO READ | కవిత కొత్త పార్టీ? సామాజిక తెలంగాణే ఎజెండానా!
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు కోవర్టులెవరన్నది తెలియదా..? లేదా కావాలనే అసలు విషయం బయట పెట్టలేదా..? అన్న చర్చ మొదలైంది. మా పార్టీలో ప్రజా స్వామ్యం ఉంది. అదే సమయంలో తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చని, సలహాలు ఇవ్వొచ్చని అన్నారు. పదేండ్లుగా అంతర్గత ప్రజాస్వామ్యం అంశాన్ని ప్రస్తావించకుండా నిన్న కవిత దయ్యాలు అనగానే ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం, అంతర్గత ప్రజాస్వామ్యం, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చిన చెప్పడం కూడా పార్టీ కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది.
అదే సమయంలో అంతర్గతంగా మాట్లాడితే బాగుండునని కూడా అన్నారు. ఇదే విషయాన్ని కవిత నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో నొక్కి చెప్పారు. తాను తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందని ప్రస్తావించారు. అంటే అంతర్గతంగా రాసిన లేఖ బయటికి ఎలా వచ్చిందన్నది ఆమె సందేహంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఎవరు..? కోవర్టులెవరన్నది హాట్ టాపిక్ గా మారింది.