
- ఆమె ఫ్లెక్సీల్లో డిఫరెంట్ కలర్
- అందులో కనిపించని కేసీఆర్ ఫొటో
- బీసీలే ఎజెండాగా ముందుకెళ్తారా?
- మీడియా, పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నాని ప్రచారం జరుగుతోంది. అమెరికా పర్యటన ముగించుకొని నిన్న శంషాబాద్ వచ్చిన కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలెవరూ రాలేదు. కానీ భారత జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డిఫరెంట్ కలర్ తో కూడిన భారీ ఫెక్సీని వారు ప్రదర్శించారు. బ్లూ కలర్ లో సామాజిక న్యాయానికి సంకేతంగా ఈ ఫ్లెక్సీ ఉంది. అదే సమయంలో సామాజిక తెలంగాణ సారథిగా కవితను పేర్కొంటూ వందల సంఖ్యలో ఫ్లెక్సీలను కూడా ప్రదర్శించారు.
గత కొంత కాలంగా బీసీ ఎజెండాతో కవిత పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సమయంలోనూ తన వివరాలు ఇచ్చారు. అదే సమయంలో కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. తన ఇంట్లోనే వారి సాదక బాధకాలు తెలుసుకున్నారు. ఇటీవల మేడే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదేండ్లు బీఆర్ఎస్ పాలన చేసినా సామాజిక తెలంగాణ సాధించలేక పోయామంటూ సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కు పెట్టారు.
ఇవన్నీ చూస్తుంటే ఆమె పార్టీ పెట్టేందుకు చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణాలను స్పష్టంగా ఎత్తి చూపిన కవిత.. ఈ మేరకు పార్టీ చీఫ్, తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం.. ఆ లేఖ కాస్తా ఆమె హైదరాబాద్ కు వచ్చే ముందు రోజే వైరల్ కావడం.. ఆమె ఫ్లయిట్ దిగి వస్తుండగానే ‘సామాజిక తెలంగాణ సారథి కవిత’ అనే భారీ ఫ్లెక్సీతో అభిమానులు రావడం.. వందల సంఖ్యలో ప్లకార్డులు కనిపించడం.. ఇవన్నీ చూస్తుంటే ముందు చూపుతో ఆర్గనైజ్డ్ గానే చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎక్కడ కూడా గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఫొటోలు కనిపిచలేదు. కేవలం కవిత ఫొటోలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ఆ ప్లకార్డుల్లో టీమ్ కవితక్క అని ఉంది.
కారు జోరు తగ్గిందని..
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాభవం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ఆ పార్టీకి 39 స్థానాలు వచ్చాయి. అందునా కంటోన్మెంట్ స్థానం నుంచి గెలిచిన లాస్య నందిత మృతి చెందడంతో ఉప ఎన్నిక రాగా ఆ స్థానం కాస్తా కాంగ్రెస్ వశమైంది. ఉన్న 38 స్థానాల్లో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బలం కాస్తా 28కి చేరింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు.
ALSO READ | తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డే: కేటీఆర్
తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేదు. ఈ క్రమంలో పార్టీ కేడర్ లో నైరాశ్యం అలుముకుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై ట్రోలింగ్స్ చేస్తున్నా.. పార్టీ భవిష్యత్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పార్టీ చీఫ్ కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. ఆయనను, మాజీ మంత్రి హరీశ్ రావును కాళేశ్వరం కేసు చుట్టుముట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్ములా ఈ రేసింగ్ కేసు వెంటాడుతోంది. ఈ తరుణంలో పార్టీకి పునర్వైభవం కష్టతరంగా మారింది.
తెరపైకి తమిళనాడు తరహా పాలిటిక్సా!?
తమిళనాడు తరహా రాజకీయాలకు తెలంగాణ కేంద్ర బిందువు కాబోతోందా..? అన్న చర్చ మొదలైంది. అక్కడ ద్రవిడ పేరుతోనే రెండు పార్టీలున్నాయి. ఒకటి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, మరొకటి దివంగత జయలలిత సారథ్యం వహించిన ఏఐఏ డీఎంకే.. ఇక్కడ కూడా అదే ఫార్ములాను కేసీఆర్ తెరవెనుక నుంచి ప్లాన్ చేస్తున్నారా..? అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకే కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కవిత పార్టీ విజయం.. పరాజయం మాట అటుంచితే బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లి ఓట్లు చీల్చడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తేవలన్న ప్లాన్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలు, మహిళల ఓటు బ్యాంకునే ఆమె లక్ష్యం చేసుకోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. కవిత ఈ ఆపరేషన్ లో సక్సెస్ అయితే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది.