పచ్చని పల్లెల్లో మైనింగ్ చిచ్చు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో తీవ్ర ఉద్రిక్తత

పచ్చని పల్లెల్లో మైనింగ్ చిచ్చు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో తీవ్ర ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో నూతనంగా ఓ కొండ ప్రాంతంలో మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు ప్రజాభిప్రాయ సేకరణ సేకరించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో తమ ప్రాంతంలో మైనింగ్ చేపట్టవద్దని తేల్చిచెప్పారు. 

మైనింగ్ చేపడితే కొండ మొత్తం తవ్వేస్తారని ఈ ప్రాంతంలో వ్యవసాయ పొలాలు, పాడిపంటలు వర్షాధారంతోనే తమ నాలుగు గ్రామాల ప్రజలు జీవిస్తున్నారని మైనింగ్ చేపడితే ఈ కొండ మొత్తం కనుమరుగైపోయి తమ బతుకులు చిద్రమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు పశువులు తినేందుకు గడ్డి కూడా దొరకదని వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుందని చెరువులకు నీరు వచ్చే మార్గాలు కూడా మూసుకుపోతాయన్నారు. 

ఇందులో భాగంగా "మైనింగ్ వద్దు ప్రజలే ముద్దు" అనే నినాదంతో గత మూడు నెలలుగా ఉద్యమం చేపట్టారు. ఇటీవల తమ సమీపంలోని జాతీయ రహదారిని దిగ్బంధించడం,  స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‎ని అడ్డుకోవడం, రాజకీయ నాయకులు  మనసు మారాలని దేవాలయాల్లో పూజలు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ 2025, సెప్టెంబర్ 14న వరికుంటపాడు మండలంలోని మైనింగ్ వద్దు అంటున్న గ్రామాలలో పర్యటిస్తారన్న సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. ముందుగా వరికుంటపాడు మండలంలో కొన్ని గ్రామాలతో పాటు ఉదయగిరి సర్కిల్ పరిధిలో 144 సెక్షన్‎తో పాటు పోలీస్ యాక్ట్ 1912 సెక్షన్ 30 ని కూడా అమలు చేశారు. 

ఉదయగిరి నియోజకవర్గంలో ప్రదర్శనలు, గుంపులుగా చేరడాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, సందర్శనాలు లాంటివి చేయరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించి వీధుల్లో కవాతులు నిర్వహించారు. ఎన్నికల సమయంలోనూ లేక లా అండ్ ఆర్డర్ గతితప్పినప్పుడు మాత్రమే పోలీసులు తమ బలప్రదర్శనను ప్రదర్శిస్తారు. 

ఇటీవలే నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఇండోసోల్ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కందుకూరు నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న బోడే రామచంద్ర యాదవ్‎ను వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలోనే ఆదివారం (సెప్టెంబర్ 14) రామచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంకు వస్తారా లేకుంటే పోలీసులు అడ్డుకుంటారా అని తీవ్ర ఉత్కంఠ ఉంది.