ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి  ప్రోగ్రాంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి పెట్రోల్ బంక్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ భవిష్యత్తులో బాగా నడుస్తుందన్నారు.  మహిళల ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాములలో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.  సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ..  రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయ సంఘాలకు రూ. 20 వేల కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించగా, రాష్ట్రవ్యాప్తంగా రూ.30 కోట్ల ఆదాయం వస్తే నల్గొండ జిల్లాలో రూ. 1.40 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.  ధాన్యం కొనుగోలులో సైతం రూ.80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారన్నారు. 

రూ.232 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణాలు  

రాష్ట్ర వ్యాప్తంగా రూ.232 కోట్లతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.  జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఏఆర్డీ ఎస్పీ రెసిడెన్సీ క్వార్టర్స్, సీఐ, ఎస్ఐ క్వార్టర్లను, శిశువిహార్‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ను తొలగించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్లను నిర్మిస్తున్నామని, అవసరమైన చోట రూ. 232 కోట్లతో పోలీస్ క్వార్టర్స్  నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 

 ఇంకా ఎక్కడైనా ఇలాంటి స్థితిలో క్వార్టర్స్ ఉన్నట్లయితే గుర్తించి వాటిని స్థానంలో కొత్త వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేశ్ రెడ్డిని ఆదేశించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐఓసిఎల్ జనరల్ మేనేజర్ సుదీప్ రాయ్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ  అదనపు కలెక్టర్. జె. శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.