
‘అమ్మో! క్యాన్సర్..’ అనే రోజులు పోయి, అదీ మామూలు రోగమే.. ఏం భయపడొద్దు అనే రోజులు వచ్చేశాయి. వైద్యశాస్త్రంలో కొత్త అధ్యాయం మొదలైనట్టే. దీంతో అన్ని రోగాల్లాగే మెడిసిన్‌తో క్యాన్సర్ మెడలు వంచే రోజులు రాబోతున్నాయా? అంటే.. అవుననే చెప్పొచ్చు. రష్యా ఆవిష్కరించిన ఒక సరికొత్త వ్యాక్సిన్ క్యాన్సర్ నుంచి కాపాడి, కొత్త జీవితాన్ని అందించబోతోందా? వివరంగా తెలుసుకుందాం.
ఏ రోగానికి భయపడనివాళ్లకు కూడా క్యాన్సర్ పేరు వింటే చెమటలు పట్టేస్తాయి. ఈ ప్రాణాంతక వ్యాధిలో నాలుగైదు దశలుంటాయి. చివరి దశ ప్రమాదం అని తెలిసినప్పటికీ.. మొదటి దశ నుంచే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. విషయం తెలియగానే ఇక రోజులు లెక్కేయాల్సిందే అన్నట్టు మనసుకు సర్ది చెప్పుకుంటుంటారు. అలాంటి ప్రాణాంతక వ్యాధిని జయించడం దాదాపు అసాధ్యం. జయించినవాళ్ల కేసుల్ని వేళ్ల మీద లెక్కేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఒక శుభవార్త చెప్పింది. క్యాన్సర్‌కు వ్యాక్సిన్ ఉందంటూ ప్రపంచానికి పరిచయం చేసింది.
ప్రస్తుతం ప్రపంచంలో 200లకు పైగా క్యాన్సర్లు ఉన్నాయి. వాటిలో ఊపిరితిత్తులు, బ్రెస్ట్, కొలొరెక్టల్, ప్రొస్టేట్, స్టమక్, బ్లడ్ క్యాన్సర్లు డేంజర్‌గా కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్స్ ప్రకారం, 2020లో దాదాపు కోటి మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్ వల్లే జరుగుతుండడం బాధాకరం. 2050 నాటికి కొన్ని కోట్ల క్యాన్సర్ పేషెంట్లు నమోదు కావొచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంచనా వేసింది. ‘‘మొక్కై వంగనిది మానై వంగునా?’’ అనే సామెత వినే ఉంటారు.
క్యాన్సర్ కూడా అంతే.. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. లేదంటే క్యాన్సర్ కణాలు అంతకంతకూ పెరిగి విషవృక్షంలా ఆ వ్యాధి శరీరమంతా పాకిపోతుంది. తద్వారా చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు రష్యా క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిందనే వార్త కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్రీ– క్లినికల్ ట్రయల్స్‌లో నూటికి నూరు శాతం ఎఫెక్ట్ చూపించిందని, ఇప్పుడు ఇది క్లినికల్ ట్రయల్స్‌కు రెడీగా ఉన్నట్లు సైంటిస్ట్‌లు చెప్తుంటే కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టు అనిపిస్తోంది.
పరిశోధనలు మొదలయ్యాయి
ప్రతి క్యాన్సర్ పేషెంట్‌కు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఎంటెరోమిక్స్ అనే థెరపాటిక్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది రష్యా. దీన్ని రష్యా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, ఎంగ్లిహార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలెక్యులార్ బయాలజీ, గమేలయా ఇన్స్టిట్యూట్ కలిసి డెవలప్ చేశాయి. అయితే గతంలోనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసిన అనుభవం గమేలయా ఇన్స్టిట్యూట్కు ఉంది. అన్ని క్యాన్సర్లకు ఒకే రకమైన టీకా కాకుండా ఒక్కొక్క రకాన్ని టార్గెట్ చేసి ఈ రీసెర్చ్ చేశారు.
రష్యా బయోటెక్నాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అందుకే ఈ రంగంలో అనుభవం ఉన్న సంస్థలను ఒక చోటకు చేర్చింది. రీసెర్చ్ జరిగేటప్పుడు లిమిటేషన్స్ తక్కువ, వేగంగా అనుమతులు లభించడంతో వేగంగా పని ముందుకుసాగింది. ఈ టీకా రీసెర్చ్‌లో టెక్నాలజీని బాగా వాడుకుంది. క్యాన్సర్ పేషెంట్లు ట్యూమర్, జెనెటిక్ ప్రొఫైల్‌ను విశ్లేషించడానికి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో ఎన్ఎమ్ఆర్ఆర్సి ఒక స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. దీనివల్ల ఒక్కో పేషెంట్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ వేగంగా తయారుచేయొచ్చు.
అయితే మరోవైపు న్యూయార్క్‌కు చెందిన మెమోరియల్ స్లోయాన్ కెట్టెరింగ్ (ఎంఎస్కే) కంపెనీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది. ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం అమెరికా ‘sipuleucel–T’ అనే టీకాను డెవలప్ చేసింది. ఇలా ఇప్పటికే ప్రివెంటివ్, థెరపాటిక్ వ్యాక్సిన్లు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లతో పార్ట్నర్ షిప్, కఠినమైన ఎఫ్‌డీఏ నిబంధనల వల్ల అమెరికా వ్యాక్సిన్ ఆలస్యమవుతోంది. భారత్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం రీసెర్చ్‌లు చేస్తోంది. ఎంఆర్ఎన్ఎ టెక్నాలజీ, జీన్ సీక్వెన్సింగ్, ఏఐలో భారత్‌కు నాలెడ్జ్ ఉంది. ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ క్యాన్సర్ల కోసం వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉంది. అడ్వాన్స్డ్ ఇమ్యునో థెరపీలు, పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో భారత్ ముందుంది.
ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్
వ్యాక్సిన్లలో ప్రివెంటివ్, థెరపాటిక్ అని రెండు రకాలుంటాయి. ప్రివెంటివ్ టీకాలను హెల్దీగా ఉన్నవాళ్లకు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఇస్తారు. థెరపాటిక్ అంటే.. ఇప్పటికే క్యాన్సర్ ఉన్నవాళ్లకు ఇస్తారు. అమెరికా క్యాన్సర్ సొసైటీ ప్రకారం బ్లాడర్, ప్రొస్టేట్ క్యాన్సర్లకు ఇప్పటికే కొన్ని థెరపాటిక్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి ప్రివెంటివ్ హెచ్‌పీవీ టీకాలున్నాయి. ఇప్పుడు రష్యా తయారుచేసింది థెరపాటిక్ టీకానే. నాలుగు నాన్–పాథోజెనిక్ వైరస్ల కలయికతో ఎంటెరోమిక్స్ను తయారుచేశారు. ఈ టీకా శరీరంలోని క్యాన్సర్ కణాలను అంతం చేస్తుంది. దాంతోపాటు పేషెంట్లో యాంటీ ట్యూమర్ ఇమ్యునిటీ పవర్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది ఒక్కో పేషెంట్లో ఒక్కోలా పనిచేస్తుంది. కొందరిలో ట్యూమర్ పెరగకుండా అడ్డుకుంటుంది. మరికొందరిలో పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే ఒక్కో పేషెంట్ కోసం ఒక్కో విధంగా పర్సనలైజ్డ్ ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌గా దీన్ని తయారుచేస్తారు.
ఇందులో ప్రతి రోగిలోని ట్యూమర్‌ను జెనెటిక్ అనాలసిస్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ వేస్తే ట్యూమర్ కణాలను ఇమ్యూనిటీ పవర్ గుర్తించేలా చేస్తుంది. ప్రతి పేషెంట్లో మ్యుటేషన్ ప్రొఫైల్‌ను నిర్ధారించడానికి స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను కూడా డెవలప్ చేసింది రష్యా. మొత్తానికి రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ గ్లియోబ్లాస్టోమా(అగ్రెసివ్ బ్రెయిన్ ట్యూమర్) , ఆక్యులార్ మెలానొమా (అరుదైన కంటి క్యాన్సర్) వంటి క్యాన్సర్లకు పనికొస్తుంది. మొదటి దశలో పేషెంట్ల మీద వ్యాక్సిన్ ప్రయోగించగా అది వందశాతం ఇమ్యూన్ యాక్టివేషన్ చేసిందని, ట్యూమర్‌ను తగ్గించి, వ్యాధిని 60–80 శాతం తగ్గించడమేగాక, ఎన్నిసార్లు పేషెంట్‌కు వ్యాక్సిన్ ఇచ్చినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించలేదని తెలిసింది.