తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డే: కేటీఆర్

తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డే: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ సొమ్మును రేవంత్ ఢిల్లీ బాసులకు దోచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు.  రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలన్నారు.  

నిన్న రాత్రి రేవంత్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని.. అరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారని కేటీఆర్ అన్నారు. 16 నెలలో 44 సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్  అరుదైన రికార్డు సృష్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పై  నిందలు,కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీకి చందాలు అన్నట్లు రేవంత్ తీరుందన్నారు.  కాంగ్రెస్ డీఎన్ ఏలోనే అవినీతి ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అన్నారు.

రేవంత్ కు బ్యాగ్ మాన్ అనే  పేరు వచ్చిందన్నారు కేటీఆర్. యంగ్ ఇండియా పేరుతో  రేవంత్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో రేవంత్ పేరు ఉందని.. సీఎం పేరు ఈడీ చార్జ్ షీట్ లో వచ్చిందన్నారు. తెలంగాణకు ఇది అవమానమని అన్నారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారడం లేదన్నారు.  రూ.50కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవి కొన్నారని మంత్రి కోమటిరెడ్డి గతంలోనే  వ్యాఖ్యలు చేశారని చెప్పారు. 

కర్ణాటకలో  యాడ్యుప్పపై విమర్శలు వస్తే రిజైన్ చెయ్యాలని ఆనాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ తెలంగాణ సొమ్మును దోచి ఢిల్లీ బాసులకు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు..మూటల ముఖ్యమంత్రి అని అన్నారు. ఓటుకు నోటు కేసు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. ఇపుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడిందన్నారు కేటీఆర్. 

రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీకి మెతక వైఖరి ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్.  వాల్మికీ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఈ కేసులో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని.. అన్ని స్కాంలో కాంగ్రెస్ ను బీజేపీ కాపాడుతోందన్నారు.   పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేస్తే వివరాలు ఎందుకు బయటపెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి అర్హత లేకున్నా అమృత్ సర్ లో పనులు కేటాయించారని ఆరోపించారు కేటీఆర్.