
లెవిస్టన్: అమెరికాలో 18 మందిని కాల్చి చంపిన నరహంతకుడు రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మెనే రాష్ట్రం లిస్బన్ ఫాల్స్ ఏరియాలోని రీసైక్లింగ్ సెంటర్లో శుక్రవారం రాత్రి రాబర్ట్ కార్డ్ డెడ్ బాడీ దొరికిందని పోలీసులు తెలిపారు. రాబర్ట్ తన తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టు గుర్తించామని చెప్పారు. అంతకుముందు రాబర్ట్ ఇంట్లో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు చెప్పారు.
రాబర్ట్ మృతితో స్థానికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రెండ్రోజుల పాటు ఇండ్లకే పరిమితమైన జనం బయటకు వచ్చారు. రాబర్ట్ కోసం వెతుకుతున్న పోలీసులు తమ ఆపరేషన్ ను ముగించారు. ‘‘లెవిస్టన్, దాని చుట్టుపక్కల కమ్యూనిటీల ప్రజలు రెండ్రోజుల పాటు ఇండ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్లందరూ ప్రశాంతంగా ఉన్నారు. అమెరికన్లు ఇలా జీవించాల్సిన దుస్థితి రాకూడదు. తుపాకీ హింసపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలి” అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు.