విద్యాప్రమాణాల పెంపులో గ్రంథాలయాలు కీలకం

విద్యాప్రమాణాల పెంపులో గ్రంథాలయాలు కీలకం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి, విద్యార్థులలో జ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి గ్రంథాలయాల ఏర్పాటు అవశ్యం.  అదేవిధంగా  గ్రంథపాలకుల నియామకం అత్యవసరం.  గురుకుల పాఠశాలల్లో ఉన్న తరహాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో  గ్రంథాలయాలు, గ్రంథపాలకుల పోస్టులు ఉండటం వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుంది.  ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల సౌకర్యం లేదు. ఉన్నచోట కూడా పూర్తిస్థాయిలో నిర్వహణ లేక, గ్రంథపాలకుల కొరతతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. 

దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు తమ విద్యా అవసరాల కోసం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. జాతీయ స్థాయి పరీక్షలు, మెరిట్ టెస్టులలో అర్హత సాధించడంలో  వెనకబడిపోతున్నారు. కేంద్రీయ విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయాలు (NVS), ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) వంటి సంస్థలు గ్రంథాలయాలకు, గ్రంథపాలకులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడుతున్నాయి. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ సౌకర్యాలు కల్పించడం ఎంతో అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ కమిషన్ 52 అంశాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించినందుకు అభినందనీయం. 

ఈ నివేదికలో గ్రంథాలయాలు, గ్రంథపాలకుల నియామకం ఒక ముఖ్యమైన అంశంగా చేర్చడం శుభపరిణామం. కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి.  గ్రంథాలయాలు, గ్రంథపాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  గ్రంథాలయాలు విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తాయి.  వివిధ విషయాలపై సమగ్ర జ్ఞానాన్ని అందిస్తాయి.  కథలు, కవితలు, వ్యాసాలు చదవడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతుంది.  అదనపు సమాచారాన్ని, రిఫరెన్స్ పుస్తకాలను గ్రంథాలయాల ద్వారా పొందడం వల్ల విద్యార్థులు పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.  
                      
 - షేక్​ రహమాన్​