
ముంబై: ఎల్‌ఐసీ తమ బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతం వరకు పెంచుకోవడానికి ఆర్‌బీఐ నుండి అనుమతి పొందిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో వ్యక్తులు, నాన్–ఫైనాన్షియల్ కంపెనీల్లో నాన్ ప్రమోటర్ల వాటాపై 10 శాతం పరిమితిని కొనసాగిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం కోటక్ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 4.96 శాతం వాటా ఉంది. ఈ డీల్ నేపథ్యంలో సోమవారం, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 2.38 శాతం లాభంతో రూ.2,011వద్ద ముగిశాయి. 2015లో ఆర్‌బిఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సెబీ రూల్స్‌కు అనుగుణంగా ఎల్‌ఐసి వాటాను పెంచుకుందని కోటక్ మహీంద్రా బ్యాంకు తెలిపింది. రూల్స్ ప్రకారం ప్రైవేట్ బ్యాంకుల్లో 5 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయాలనుకునే ప్రతి వ్యక్తి లేదా సంస్థకు ఆర్‌బీఐ నుండి ముందస్తు అనుమతి అవసరం. మనదేశ స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో ఒకటైన ఎల్‌ఐసీ, వచ్చే ఏడాది మార్చి నాటికి పబ్లిక్ ఇష్యూకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు దాదాపు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది.