LIC ఆస్తులను నిర్వహించేందుకు సబ్సిడరీ

LIC ఆస్తులను నిర్వహించేందుకు సబ్సిడరీ
  • రియల్ ఎస్టేట్ ఆస్తుల నుంచి ఆదాయం పెంచుకోవాలని ప్లాన్

న్యూఢిల్లీ: ఎల్‌‌ఐసీ తన వద్ద ఉన్న దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన భారీ రియల్ ఎస్టేట్ ఆస్తుల నుంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. ఈ ఆస్తులను మేనేజ్ చేసేందుకు సపరేట్ సబ్సిడరీని ఏర్పాటు చేయనుంది.

గత 70 ఏళ్లుగా సంస్థ కొనుగోలు చేసిన ఆస్తులన్నింటినీ పాలసీదారులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఒక పెట్టుబడిగా చూస్తున్నట్లు ఎల్‌‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి తెలిపారు. సొంతంగా వాడుకునే భవనాల రూపురేఖలను మార్చడంతో పాటు, లీజుకు ఇచ్చిన ఆస్తుల నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలను వెతుకుతున్నామని  ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఎల్‌‌ఐసీలో తన వాటాను మరింత విక్రయించడానికి  తాము మొదటి రోజు నుంచే సిద్ధంగా ఉన్నామని దొరైస్వామి స్పష్టం చేశారు.

లిస్టింగ్ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాను 10శాతం లేదా 15శాతానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రస్తుత మార్కెట్ వోలటాలిటీ కారణంగా సరైన సమయం కోసం వేచి చూస్తోందని చెప్పారు. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో ఎల్‌‌ఐసీ దేశంలోనే అత్యధికంగా  నికర లాభాన్ని ఆర్జించిన సంస్థగా నిలిచింది. కంపెనీకి రూ.23,420 కోట్ల లాభం వచ్చింది.