జీఎస్టీ తగ్గింపుతో పెరుగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం....

జీఎస్టీ తగ్గింపుతో పెరుగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం....

భారతదేశంలో జీవిత బీమా (life insurance) రంగం వరుసగా రెండో నెల కూడా మంచి వృద్ధిని చూసింది. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2025 అక్టోబర్‌లో కొత్తగా వచ్చిన వ్యాపారం ద్వారా వచ్చే ప్రీమియం గత సంవత్సరం కంటే 12.1 శాతం పెరిగి రూ.34 వేల 007 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల మంచి పరిణామాన్ని సూచిస్తుంది, ఎందుకంటే 2025 ఆగస్టులో ఈ వృద్ధి 5.2 శాతం పడిపోయింది.

ఈ పెరుగుదలకు వ్యక్తిగత విభాగంలో (సింగిల్ గా తీసుకునే పాలసీలు) మంచి పనితీరే కారణం. ముఖ్యంగా నాన్-సింగిల్ ప్రీమియం పాలసీలు (ప్రతినెల లేదా ఏడాది  ప్రీమియం చెల్లించేవి) బాగా పెరిగాయి. దీని బట్టి చూస్తే ప్రజలు రెగ్యులర్‌గా డబ్బులు కట్టే ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా తీసుకుంటున్నారు.

పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ అలాగే ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం జీఎస్టీ (GST) తీసేసింది. ఈ చర్య   మొత్తం మీద ఇన్సూరెన్స్ కంపెనీల వృద్ధిని నిలబెట్టుకోవడానికి బాగా సహాయపడింది. గతంలో 18 శాతం ఉన్న ఈ జీఎస్టీ రేటును 22  సెప్టెంబర్ 2025 నుండి పూర్తిగా తొలగించారు.

►ALSO READ | పాన్-ఆధార్ లింక్.. ఈ డెడ్ లైన్ దాటితే ఇబ్బందులు తప్పవు..

కేర్‌ఎడ్జ్ ప్రకటన ప్రకారం, ఈ వృద్ధి దాదాపు అన్ని రకాల బీమా విభాగాలలో కనిపించింది.  ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) మార్కెట్‌లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రెండంకెల వృద్ధిని (10 శాతం కంటే ఎక్కువ) సాధించాయి. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు కూడా  ఉద్యోగుల కోసం తీసుకునే గ్రూప్ బీమా వ్యాపారం కూడా మళ్లీ పెరిగింది.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు సరైన సమయంలో అమ్మకాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, దీనివల్ల డిమాండ్ పెరిగిందని అన్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుండి మద్దతు, కొత్త ఉత్పత్తులు, ఆన్‌లైన్ (డిజిటల్) తో సహా మంచి అమ్మకాల వ్యవస్థల కారణంగా ఈ రంగం ఈ మంచి  వృద్ధిని కొనసాగిస్తుందని కేర్‌ఎడ్జ్ ఆశిస్తోంది.