సేవ్​ చేసిన వాట్సాప్​ స్టేటస్​

సేవ్​ చేసిన వాట్సాప్​ స్టేటస్​
  •  పురుగుల మందు తాగిన యువకుడిని కాపాడిన పోలీసులు
  •  ఫోన్​ లొకేషన్​ ఆధారంగా గుర్తింపు 

చేవెళ్ల, వెలుగు: పోలీసులు స్పందించడంతో చేవెళ్లలో ఓ యువకుడి ప్రాణం నిలిచింది.  చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన విఠలయ్య కొడుకు ఆనంద్(21) స్థానిక  ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం తండ్రి తిట్టాడని మనస్తాపం చెందిన ఆనంద్, స్థానిక కొనగట్టు శివాలయం సమీపంలోని చెట్టు కింద కూర్చొని పురుగుల మందు తాగాడు. 

ఆ విషయాన్ని తెలియజేస్తూ వాట్సాప్​ స్టేటస్​పెట్టాడు. కొడుకు వాట్సాప్​ స్టేటస్​ ను చూసిన విఠలయ్య వెంటనే చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ ​లొకేషన్​ఆధారంగా ఆనంద్ ​కొనగట్టు శివాలయం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆనంద్​ నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడి ఉన్నాడు. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందును కక్కించారు. సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ నరేశ్, హోంగార్డు రమేశ్ ను చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డి అభినందించారు.