లిక్కర్​ స్కామ్..​ చార్టర్​ ఫ్లైట్లలో ఢిల్లీకి డబ్బు!

లిక్కర్​ స్కామ్..​ చార్టర్​ ఫ్లైట్లలో ఢిల్లీకి డబ్బు!
  •  హైదరాబాద్​ నుంచి చేరవేసినట్లు ఈడీ అనుమానం

  •  ‘జెట్​ సెట్​ గో’ విమానయాన సంస్థ ఆపరేషన్స్​పై ఆరా

  •   సంస్థకు సీఈవోగా అరబిందో శరత్‌‌ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి

  •   కనికారెడ్డితో ఓ మహిళా నేతకు సంబంధాలు


హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రైవేట్‌‌ చార్టర్‌‌‌‌ ఫ్లైట్స్‌‌ లింకులు బయటపడుతున్నాయి. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌‌చంద్రారెడ్డి భార్య సీఈవోగా ఉన్న ‘జెట్ సెట్‌‌ గో’ విమానయాన సంస్థ ఆపరేషన్స్‌‌పై ఈడీ వివరాలు సేకరించింది. నిందితులు ఈ కంపెనీ విమానాల ద్వారా హైదరాబాద్​ నుంచి ఢిల్లీకి డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నది. 

కంపెనీ ఆపరేషన్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు కోరుతూ  గత నెల 17న ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా చైర్మన్‌‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్తా లెటర్ రాశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్‌‌ కింద నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్నామని, అత్యవసరంగా వివరాలు తెలుపాలని కోరారు. జెట్ సెట్‌‌ గో ఏవియేషన్‌‌ సర్వీసెస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ప్రారంభమైన నాటి నుంచి గత నెల 17 వరకు జరిగిన ఆపరేషన్స్ వివరాలు వెల్లడించాలని ఈడీ లెటర్​లో పేర్కొంది. చార్టర్‌‌ విమానాల్లో ప్రయాణించిన ప్యాసింజర్ల లిస్ట్‌‌ అందించాలని కోరింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈడీకి ఎయిర్ పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా వివరాలు అందించినట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగానే ఈడీ అధికారులు.. శరత్‌‌చంద్రారెడ్డిని ఈ నెల10న అరెస్ట్  చేసినట్లు తెలుస్తున్నది. 

జెట్‌‌ సెట్‌‌ గో సీఈవో గా శరత్‌‌చంద్రారెడ్డి భార్య

జెట్ సెట్‌‌ గో విమానయాన సంస్థ సీఈఓగా శరత్‌‌చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కనికారెడ్డికి ఏపీ, తెలంగాణలోని రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకురాలితో కూడా కనికారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. శరత్‌‌చంద్రారెడ్డితో రాబిన్‌‌ డిస్టిలరీస్‌‌ డైరెక్టర్లు బోయినపల్లి అభిషేక్‌‌రావు, అరుణ్‌‌ రామచంద్రపిళ్లైకి వ్యాపారలాదేవీలు ఉన్నాయా అనే కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా షెల్ కంపెనీల నుంచి జరిగిన మనీలాండరింగ్ వ్యవహారమంతా జెట్ సెట్‌‌ గో చార్టర్​ఫ్లైట్స్​తో జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నది.  

త్వరలో మరిన్ని అరెస్టులు!

రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల ట్రావెల్ హిస్టరీ ఈడీ చేతికి అందినట్లు సమాచారం. జెట్‌‌ సెట్ గో చార్టర్​ విమానాల్లో ఢిల్లీకి వెళ్లిన వారి వివరాలతో ఈడీ దూకుడు పెంచనుంది. లిక్కర్ స్కామ్‌‌లో వెలుగు చూసిన షెల్ కంపెనీల హవాలా, ఇతర దేశాలకు జరిగిన మనీలాండరింగ్‌‌పై ఆధారాలు సేకరించనుంది. శరత్‌‌చంద్రారెడ్డి డైరెక్టర్‌‌‌‌గా ఉన్న కంపెనీలతో పాటు జెట్‌‌ సెట్‌‌ గో నుంచి జరిగిన మనీట్రాన్సాక్షన్స్‌‌పై ఈడీ ప్రధాన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈడీ గుర్తించిన షెల్ కంపెనీల లిస్ట్‌‌లో రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో రాష్ట్రానికి చెందిన మరికొందరిని ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించినట్లు తెలిసింది.