
సింహాన్ని దూరం నుంచి చూడాలనుకుంటే తప్పులేదు.. కానీ జూలుతో జడేయాలనుకుంటేనే ప్రాబ్లం’.. కొంచెం అటూఇటూగా ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. ఇక్కడ టూరిస్టులు ఆ సింహాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలీదు గానీ.. పార్క్ దాటేదాక వెంటపడ్డది. వెహికల్ సహకరించింది కాబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే సింహానికి ఫుల్ మీల్స్ అయ్యే వాళ్లు. కొంతమంది టూరిస్టులు కర్నాటక బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జువాలాజికల్ పార్క్‌లో టాప్‌లెస్ సఫారీ జీపు ఎక్కి సింహాలు, పులుల్ని చూద్దామని అలా లోపలికి వెళ్లారు.
కాసేపు ప్రయాణించాక అక్కడో సింహరాజం సేదతీరుతూ కన్పించింది. జీపు దాన్ని సమీపించగానే అందులో ఉన్నోళ్లు ఏం సైగ చేశారో గానీ.. ఒక్కసారిగా లేచి జీపు వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ జీపును వేగంగా డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. సింహం కూడా అదే వేగంతో దూసుకొస్తుంటే అందులో ఉన్నోళ్లకు వెన్నులో వణుకుపుట్టిందనుకుంటా.. ‘పోనియ్యి.. పోనియ్యి..’ అంటూ గట్టిగా కేకలు వేశారు. జీపు ఎంత స్పీడు పోతున్నా.. సింహమూ అదే స్పీడుతో వెంటపడింది. ఓ ఐదారు నిమిషాల ఛేజింగ్ తర్వాత సింహరాజం కాస్త శాంతించి వెనక్కి తగ్గింది. బతుకుజీవుడా అంటూ టూరిస్టులు జూ బార్డర్ దాటేశారు. అన్నట్టు.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.