అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు

అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు

Lionel Messi Retirement: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1–0 తేడాతో ఓడిపోయిన తర్వాత అర్జెంటీనా క్యాంప్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. మెట్లాఫ్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనెల్ స్కలోని (Lionel Scaloni) మాట్లాడుతూ.. తన భవిష్యత్తు, కెప్టెన్ లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్‌లో టైటిల్ గెలవలేకపోయినప్పటికీ, తమ జట్టు ప్రయాణాన్ని తక్కువ చేసి చూడలేమని స్పష్టం చేశారు.

డిసెంబర్‌తో ముగియనున్న కాంట్రాక్ట్: 

తన కోచింగ్ భవిష్యత్తు గురించి స్కలోని మాట్లాడుతూ, అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ప్రెసిడెంట్‌తో త్వరలోనే మాట్లాడతానని చెప్పారు. నిజం చెప్పాలంటే, నా భవిష్యత్తు ప్లాన్స్ గురించి నేను ఇంకా లియోనెల్ మెస్సీతో మాట్లాడలేదు.. నేను అసోసియేషన్ ప్రెసిడెంట్‌తో చర్చిస్తాను.. నా మైండ్‌లో ఒక ఐడియా అయితే ఉంది. ప్రస్తుతానికైతే డిసెంబర్ వరకు ఉన్న నా కాంట్రాక్ట్‌ను గౌరవిస్తాను.. కానీ ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై కొంచెం ఆలోచించుకోవడానికి నాకు సమయం కావాలని పేర్కొన్నారు.

లాకర్ రూమ్‌లోనే నా కన్నీళ్లన్నీ కార్చేశాను: 

ఫైనల్లో ఓడిపోయినందుకు అభిమానులు బాధపడటం సహజమేనని, కానీ ఫైనల్ చేరడం కూడా ఒక గొప్ప విజయమేనని కోచ్ లియోనెల్ స్కలోని గుర్తుచేశారు. ఒక టోర్నమెంట్‌లో విజేతగా నిలిచినప్పుడు ఎంతలా ఎంజాయ్ చేస్తామో, రన్నరప్‌గా నిలిచినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండటం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం.. కానీ ఇది కూడా ఒక సక్సెస్.. మేము ఏం సాధించామో, ఎలా పోరాడామో ప్రజలందరికీ తెలుసు.. మ్యాచ్ ముగిసిన వెంటనే లాకర్ రూమ్‌లోనే నా కన్నీళ్లన్నీ కార్చేశాను.. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్‌లో నేను ఏడవడం లేదని స్కలోని తెలిపారు. 

మా ఆటగాళ్లు వీరులు: 

టోర్నమెంట్ అంతటా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన తమ ఆటగాళ్లను లియోనెల్ స్కలోని ఆకాశానికెత్తారు. నా జట్టులోని ప్లేయర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. మైదానంలో వారు నిజమైన వీరుల్లా (Warriors) పోరాడారు.. మేము ఒక అద్భుతమైన జట్టుతో తలపడ్డాము.. మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ప్లేయర్స్ కూడా మా దగ్గరకు వచ్చి.. మీరు ఇంతలా పోటీ ఇస్తారని మేము అస్సలు ఊహించలేదు, మీ ఆట చూసి షాక్ అయ్యామని చెప్పారు. ఇది మాకు చాలా పాజిటివ్ సైన్.. భవిష్యత్తు తరాలు కూడా ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాయన్నారు. 
 
ఆరో ప్రపంచకప్‌తో రిటైర్మెంట్ ఖాయమేనా?: 

ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా టైటిల్ డిఫెన్స్ ముగిసింది. టోర్నమెంట్ మొత్తంలో కేవలం ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకున్న స్పెయిన్, ఫైనల్లోనూ అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో విజేతగా నిలిచింది. కాగా, ఈ మెగా టోర్నీతో మెస్సీ తన కెరీర్‌లో ఆరో ప్రపంచకప్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ 2026 వరల్డ్ కప్ తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పడం దాదాపు ఖాయమని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.