
- కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిట్ రిలీజ్.. త్వరలో నోటిఫికేషన్
- దరఖాస్తుల ద్వారా రూ.5 వేల కోట్ల ఆదాయం టార్గెట్
- రిజర్వేషన్లు, లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పుల్లేవ్
- డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రాష్ట్ర సర్కార్ బుధవారం గెజిట్ విడుదల చేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రస్తుతమున్న ఎక్సైజ్ పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా, 2025–-27 ఎక్సైజ్ ఇయర్‌కు గాను డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో దరఖాస్తుల రూపంలోనే దాదాపు రూ.5 వేల కోట్లు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ప్రతి రెండేండ్లకు ఒకసారి మారుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కావాలి. సాధారణంగా ఈ ప్రక్రియను నవంబర్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం 2023లో ఆగస్టులోనే ఈ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఈసారి కూడా అదే పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. కాగా, రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక దుకాణానికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కానీ ప్రతి దరఖాస్తుకూ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి. ఈ దరఖాస్తు సొమ్ము తిరిగి వెనక్కి (రీఫండ్) ఇవ్వరు.
పెరుగుతున్న అప్లికేషన్ల ఆదాయం..
కొత్త మద్యం పాలసీ ప్రకటించిన ప్రతిసారీ వైన్స్అప్లికేషన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఫలితంగా ప్రభుత్వ ఖజనాకు రాబడి కూడా పెరుగుతున్నది. 2023–-25 ఎక్సైజ్ పాలసీలో 1,31,490 దరఖాస్తులు రాగా.. వాటి ద్వారా రూ.2,629 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచడంతో మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. 2021–23 ఎక్సైజ్పాలసీలో మొత్తం 67,849 అప్లికేషన్లు రాగా, వాటి ద్వారా సర్కారుకు రూ.1,356 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త మద్యం పాలసీలో కొత్తగా టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలతో పాటు తక్కువ ఖర్చుతో మైక్రో బేవరేజెస్ (డ్రాట్ బీర్), పండ్లతో తయారు చేసిన వైన్ లాంటి కొత్త రకాలను కూడా తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే 604 కొత్త మద్యం రకాలకు అనుమతులు ఇచ్చింది.
రిజర్వేషన్లు యథాతథం..
రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్‌లో గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్కల్పించనున్నారు. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు ఉంటాయి. 2,620 దుకాణాలు ఉండగా ఇందులో గౌడ్స్‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కేటాయించారు. ఏ జిల్లాలో ఎక్కడ? ఏ షాప్ రిజర్వేషన్ పరిధిలోకి వస్తుందనేది నోటిఫికేషన్‌లో స్పష్టం చేయనున్నారు. మద్యం దుకాణాల సమయాలు గత పాలసీ మాదిరిగానే కొనసాగుతాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. కొత్త పాలసీలోనూ ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ట్యాక్స్నే కొనసాగించారు. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు , లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్ష నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా ఎక్సైజ్ట్యాక్స్గా నిర్ణయించారు. ఈసారి కూడా ఇవే స్లాబులు కొనసాగనున్నాయి.