అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం .. ఇవన్నీ బంద్!

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం .. ఇవన్నీ బంద్!

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా... కొన్ని రాష్ట్రాలు ఆల్కహాల్​ అమ్మకాలు బంద్​ పెట్టాయి. జనవరి 22న ఆల్కహాల్ తీసుకోవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. వాటిలో మొదటిది ఉత్తర్​ప్రదేశ్​. మద్యం అమ్మడానికి వీల్లేదని ఆదేశించింది. ‘‘డ్రై డే అంటే మద్యం అమ్మకాలు అనుమతి లేని రోజు. మద్యం దుకాణాలతోపాటు పబ్బులు, రెస్టారెంట్​ బార్​లు కూడా మద్యాన్ని అమ్మకూడదు. జనవరి 22న జాతీయ పండుగలా జరుపుకోవాలి’’ అన్నారు ఆ రాష్ట్ర సీఎం. 

ఇదిలా ఉంటే ‘ఆలిండియా జమియతుల్ ఖురేష్​​’ అనే ముస్లిం సంస్థ​ లక్నోలో జనవరి 22న మాంసం దుకాణాలు బంద్​ చేయాలని ఆదేశించింది. ఆ సంస్థ సెక్రటరీ షహబుద్ధిన్​ ఖురేషి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అవధ్ వాసులం. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. అందుకే ఆ రోజున బిలోచ్​పురా, సదర్​ కేంట్, ఫతేగంజ్, లటౌచె రోడ్​ ప్రాంతాల్లోని మాంసం వ్యాపారులకు బిజినెస్ బంద్​ పెట్టాలని చెప్పాం” అన్నారు.

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆ రోజున సెలవు ప్రకటించింది. దాంతోపాటు గోవా, ఒడిశా రాష్ట్రాల్లోనూ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఇచ్చారు. 

మిగతా రాష్ట్రాల్లో...

జనవరి 22న ఛత్తీస్​గఢ్​ ఎక్సైజ్ శాఖ కూడా డ్రై డే పాటించాలని ఆదేశించింది. ఛత్తీస్​గఢ్​ ఎక్సైజ్​ చట్టం,1915లోని సెక్షన్​ 24లోని సబ్​ సెక్షన్​ (1) ప్రకారం, రాష్ట్రంలోని అన్ని దేశీ, విదేశీ మద్యం రిటైల్​ షాపులు, రెస్టారెంట్​ బార్​లు, హోటల్ బార్​లు, క్లబ్​లు మూసివేస్తారు. మద్యం అక్రమ నిల్వలను అరికట్టేందుకు, అనుమానాస్పద ప్రదేశాలు, వాహనాలపై నిఘా పెట్టేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, మద్యం అక్రమ రవాణా​

అమ్మకాలను అదుపుచేసేలా చర్యలు తీసుకోవాలని డివిజన్, రాష్ట్రస్థాయి ఫ్లయింగ్​ స్క్వాడ్​లతో పాటు అన్ని జిల్లా ఆఫీస్​లకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్​ ధామి జనవరి 22న డ్రై డేగా పాటించాలని ప్రకటించారు. అలాగే  ప్రధాన ఆలయాల్లో, గురుద్వారాల్లో ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు.

రాజస్తాన్ ప్రభుత్వం కూడా జనవరి 22న డ్రై డే అని అధికారికంగా ప్రకటించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కూడా రాష్ట్రమంతా జనవరి 22న ‘డ్రై డే’ పాటించాలన్నారు. ఈ రాష్ట్రాలే కాకుండా హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ‘డ్రై డే’ అనౌన్స్ చేశాయి. 

కారణాలు ఇవే..

వేడుకల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాంటప్పుడు శాంతిభద్రతలను కాపాడాలి. ప్రజలకు ఇబ్బందులు రాకూడదు. ప్రమాదాలు జరగకూడదు. వీటితోపాటు మతపరమైన భావాలను గౌరవించడానికి కూడా.. జనవరి 22న మద్యం దుకాణాలు బంద్​ చేస్తున్నాం అంటున్నాయి ఆయా రాష్ట్రాలు.